బ్రిటన్ ఉప ఎన్నికల్లో లేబర్ పార్టీ అభ్యర్థి విజయ భేరీ!

బ్రిటన్‌లో తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ విజయభేరీ మోగించింది. ఈ దేశంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటైన తర్వాత జరిగిన తొలి ఉప ఎన్నికల్లో ఈ ఫలితాలు అధికార పార్టీకి గట్టి షాక్‌నిచ్చాయి. లేబర్‌ పార్టీ అభ్యర్థి డెబ్బీ అబ్రహామ్స్‌ వాయువ్య ఇంగ్లండ్‌లోని ఓల్ధామ్‌ ఈస్ట్‌, శాడిల్‌వర్త్‌లో 3,500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. లిబరల్‌ డెమొక్రాట్లు రెండో స్థానంలో ఉండగా వారి సంకీర్ణ భాగస్వాములు కన్సర్వేటివ్‌లు తృతీయ స్థానంలో నిలిచారు.

కన్సర్వేటివ్‌ల ఓట్లు దాదాపు ఏడు వేలకు పైగా తగ్గిపోయాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఉప ప్రధాని నిక్‌ క్లెగ్‌ నేతృత్వంలోని లిబరల్‌ డెమొక్రాట్‌ అభ్యర్థిని లేబర్‌ పార్టీ 103 ఓట్ల తేడాతో ఓడించింది. ఈ ఉప ఎన్నికలు లేబర్‌ నేత ఎడ్వర్డ్‌ మిలిబాండ్‌ నేతృత్వంలో ముందున్న సుదీర్ఘ ప్రయాణానికి తొలి అడుగు అన్ని అబ్రహామ్స్‌ చెప్పారు.

సుదీర్ఘంగా 13 యేళ్ళ పాటు అధికారంలో ఉన్న అనంతరం గత సంవత్సరం మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఓడిపోయిన సంగతి తెల్సిందే. గురువారం ఎన్నిక అనంతరం వెలువడిన ఈ ఫలితం లేబర్‌కు నిజమైన ఏకైక పోటీదారుగా ఉన్న లిబరల్‌ డెమొక్రాట్లకు, మొత్తంగా సంకీర్ణానికి ఎదురు దెబ్బగా భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి