నేడు మహారాష్ట్ర సీఎల్పీ నేత ఎన్నిక: చవాన్‌కే ఛాన్సెస్!

శనివారం, 24 అక్టోబరు 2009 (13:03 IST)
మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేలు శనివారం భేటీ కానున్నారు. ఈ భేటీలోనే తమ కొత్త నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్‌చవాన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. మరో ఐదు రోజుల్లో తన 51వ పుట్టిన రోజును జరుపుకోనున్న చవాన్‌కు సీఎల్పీ నేత ఎన్నిక బహుమతిగా కూడా అయ్యే అవకాశం ఉంది.

అశోక్‌ చవాన్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేవలం పదిమాసాలు మాత్రమే అయింది. ఈ మధ్యకాలంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లను అధిష్టానానికి అందించారు. ప్రధానంగా, పదినెలలో ఎలాంటి వివాదంలో ఆయన చిక్కుకోక పోవడం ప్లస్ పాయింట్‌గా మారింది. అందువల్ల ఆయనకే మహారాష్ట్ర సీఎం పీఠం పగ్గాలు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

అయితే, సీఎం రేసులో అశోక్‌ చవాన్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. కేంద్ర మంత్రులు విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌, పృథ్వీరాజ్‌ చవాన్‌, సుశీల్‌ కుమార్‌ షిండేలతో పాటు.. పార్టీ రాష్ట్రాధ్యక్షుడు మానిక్‌రావ్‌ థాక్రే, మాజీ ముఖ్యమంత్రి నారాయణ్‌ రాణే, రెవెన్యూ మంత్రి పతంగరావ్‌ కదం వంటి హేమాహేమీలు ఉన్నారు.

అయితే, నారాయణ్ రావు, విలాస్ రావ్ దేశ్‌ముఖ్‌, పతంగరావ్, మానిక్‌రావ్‌లకు అవకాశాలు తక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. నారాయణ్ రావు గతంలో సోనియా విమర్శలు చేసిన విషయం తెల్సిందే. విలాస్ రావ్ ఇటీవలే లోక్‌సభకు ఎన్నికయ్యారు. తాను సీఎం రేసులో లేనని ఆయనే స్వయంగా చెప్పారు.

ఇకపోతే..వృథ్విరాజ్ చౌహాన్, దళిత నేత సుషీల్ కుమార్ షిండే‌, చవాన్‌ల మధ్య పోటీ నెలకొంది. ఈ ముగ్గురిలో పృథ్విరాజ్, షిండేలు కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. ఈ సమీకరణాలను బేరీజు వేస్తే చవాన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

వెబ్దునియా పై చదవండి