ఆయనలా అనలేదని కేంద్ర హోంశాఖ ప్రకటన!

శుక్రవారం, 11 డిశెంబరు 2009 (19:38 IST)
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదే రాజధాని అని కేంద్రం హోంశాఖామంత్రి జీకే.పిళ్లే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. ఆయన అనలేదని వివరణ ఇచ్చింది. తాను అలా అనలేదని, తన మాటలను మీడియా వక్రీకరించిందని పిళ్లై పేర్కొన్నట్టుగా కేంద్ర హోంశాఖ శుక్రవారం సాయంత్రం ఒక లిఖితపూర్వక ప్రకటనను విడుదల చేసింది.

జమ్మూకాశ్మీర్ పర్యటనలో ఉన్న పిళ్లై మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. అంతటితో ఆగకుండా, హైదరాబాద్ తెలంగాణాలో అంతర్భాగమని, అందువల్ల కొత్త రాష్ట్రానికి హైదరాబాదే రాష్ట్ర రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా తయారయ్యాయి. వీటిపై కేంద్రం హోంమంత్రి చిదంబరం వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. ఇదే సమయంలో పిళ్లై వ్యాఖ్యలపై ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు.. రాయలసీమ, ఆంధ్రప్రాంత ప్రజలు ఆగ్రహంతో రగిలి పోయారు. పిళ్లై దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

దీంతో పిళ్లై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను అలా అనలేదన్నారు. దీనిపై హోంశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

వెబ్దునియా పై చదవండి