నేడో.. రేపో... అన్యోన్యమైన పరిష్కారం: మన్మోహన్

సోమవారం, 21 డిశెంబరు 2009 (13:49 IST)
తెలంగాణ అంశ పరిష్కారానికి నేడో.. రేపో ఇరు వర్గాలకు అన్యోన్యమైన పరిష్కారమార్గం కనుగొంటామని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధానిని కలుసుకున్న సీమాంధ్ర ఎంపీలకు ఆయన హామీ ఇచ్చారు.

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు కావూరు సాంబశివరావు నేతృత్వంలో ప్రధానితో సమావేశయ్యారు. ఈ సందర్భంగా వారితో ప్రధాని మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోదని ఆయన హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ సమచారం. అదేసమయంలో ఇరు ప్రాంతాల వారిని నొప్పించకుండా ఉండేలా మధ్యేమార్గంతో పరిష్కారం కనుగొనున్నట్టు ఆయన తెలిపారు.

ఈ సమావేశం అనంతరం ఏలూరు ఎంపీ కావూరు సాంబశివరావు మాట్లాడుతూ... రాష్ట్ర విభజనపై ఏకపక్ష నిర్ణయం ఉండబోదని హామీ ఇచ్చినట్టు తెలిపారు. అన్ని పార్టీలు అంగీకరించేలా అన్యోన్యమైన నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఇదే విషయంపై కేంద్ర ఉక్క శాఖ సహాయ మంత్రి ఏ.సాయ్ ప్రతాప్ కూడా మాట్లాడుతూ.. సోమవారం రాత్రి ఆమోదయోగ్యమైన ప్రకటన చేయనుందని చెప్పారు. రాష్ట్రంలో ఉత్పన్నమైన పరిణామాలను, ప్రజలమనోభావాలను కాంగ్రెస్ అధిష్టానం నిశితంగా గమనిస్తోందన్నారు. మూడు ప్రాంతాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ సంతృప్తి పరుస్తుందన్నారు.

వెబ్దునియా పై చదవండి