కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో 'ఆ నలుగురి' శాఖలు భద్రం!

కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ బుధవారం సాయంత్రం ఐదు గంటలకు సాగనుంది. ఇందులో నలుగురు మంత్రులకు ఉద్వాసన పలకడం ఖాయమని తెలుస్తోంది. అలాగే, కేంద్ర మంత్రివర్గంలో కీలక శాఖలైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ శాఖల మార్పు జోలికి మాత్రం వెళ్లరాదని యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ సూచించినట్టు సమాచారం.

ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ (వెస్ట్‌బెంగాల్), హోం మంత్రిగా చిదంబరం (తమిళనాడు), రక్షణ మంత్రిగా ఏకే.ఆంటోనీ (ఏకే.ఆంటోనీ), విదేశాంగ మంత్రిగా ఎస్ఎం.కృష్ణ (కర్ణాటక)లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ప్రణబ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి, ఆయన స్థానంలో సి.రంగరాజన్ లేదా మాంటెక్ సింగ్ అహ్లువాలియాకు అప్పగించాలని ప్రధాని భావించారు.

దీనికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అంగీకరించలేదన్నది సమాచారం. ఆ నలుగురు పార్టీలో సీనియర్ నేతలు మాత్రమే కాకుండా, అధిష్టానాన్ని విధేయులుగా ఉన్నారు. అందువల్ల వారి శాఖల్లో మార్పులు చేసి వారిని అసంతృప్తికి లోను చేయడం భావ్యంకాదని ఆమె భావిస్తున్నారు. అందుకే ఆ నాలుగు శాఖల జోలికి వెళ్లవద్దని ప్రధానికి సోనియా ఖరాకండిగా చెప్పినట్టు సమాచారం.

ఇకపోతే.. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలకు ఆశాభంగమే జరగనుంది. ప్రాంతీయ విభేదాలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్‌ను ప్రస్తుతానికి పక్కన పెట్టేయడం మంచిదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా కేంద్ర మంత్రి వర్గంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధులు జనార్ధన్ ద్వివేది, మనీష్ తివారీలను కేబినేట్‌లోకి తీసుకోనున్నట్లు తెలిసింది. అలాగే, కేంద్ర మంత్రులు ఆజాద్, కమల్ నాథ్, అంబికాసోనీలకు పార్టీ బాధ్యతలను అప్పగించాలని సోనియా భావిస్తున్నారు. దీనికి అనుగుణంగానే మంత్రివర్గంలో మార్పులు చేర్పులో చోటు చేసుకోనున్నాయి.

వెబ్దునియా పై చదవండి