ఆహార భద్రతా బిల్లు : పేదల ఆకలి తీర్చేందుకే.. సోనియా

సోమవారం, 26 ఆగస్టు 2013 (17:44 IST)
File
FILE
ఆహార భద్రతా బిల్లును గత 2009 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే యూపీఏ-2 ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ చెప్పుకొచ్చారు. సోమవారం లోక్‌సభలో ఆహార భద్రతా బిల్లుపై జరిగిన చర్చలో ఆమె పాల్గొని ప్రసంగించారు.

ఆహార భద్రత బిల్లు ఒక చారిత్రక నిర్ణయమన్నారు. 2009లో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ బిల్లు ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నందుకు తమెకెంతో ఆనందంగా ఉందన్నారు.

ఈ బిల్లు ద్వారా రైతులతో పాటు దేశంలోని కోట్లాది మంది పేద ప్రజలు కూడా లబ్ధి పొందుతారన్నారు. ముఖ్యంగా దేశంలో పౌష్టికాహార లోపం లేని చిన్నారులను చూడాలన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై వెనక్కు తగ్గేదిలేదని, భవిష్యత్‌లో తగ్గబోమని ఆమె తేల్చి చెప్పారు.

ఆహార భద్రత అన్ని రాష్ట్రాల్లో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా, దేశంలో ఎంతో మంది పేదవారున్నారని, పేదల కడుపు నింపడానికే ఆహార భద్రత బిల్లును ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ప్రజల ముఖాల్లో సంతోషం చూడాలన్నదే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ బిల్లు ద్వారా దేశంలోని 65 శాతం మందికి ఆహారం దొరుకుతుందని వివరించారు.

వెబ్దునియా పై చదవండి