నమ్మిన వారికి కొంగు బంగారు... వైఎస్

శుక్రవారం, 4 సెప్టెంబరు 2009 (12:27 IST)
File
FILE
తనను నమ్ముకుని, తన కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న వారి పట్ల జన హృదయ నేత వైఎస్.రాజశేఖర రెడ్డి 'కొంగు బంగారం'గా కనిపించాడు. తన చెంతన ఉన్న వారి కష్టసుఖాల్లో పాలు పంచుకున్నాడు. ఆపదల్లో ఆదుకున్నాడు. అహరహం వారికి ఏదైనా చేయాలని పరితపించేవారు. తనలాగే తన మిత్రులు, అనుచరులు, నమ్ముకున్నవారు గౌరవప్రదమైన జీవితం గడపేలా పథకాలు రచించి, అవి అమలయ్యేలా కృషి చేశాడు దివంగత అపరభగీరథుడు వైఎస్.రాజశేఖర రెడ్డి.

శ్రీకృష్ణదేవరాయల పాలనలో రతనాల సీమగా పేరుగాంచిన రాయలసీమ.. కాలక్రమేణ ఫ్యాక్షనిజానికి పుట్టినిల్లుగా మారింది. అది నేటికీ కొనసాగుతోంది. అలాంటి గడ్డపై రాజశేఖరుడు జన్మించాడు. ప్రత్యర్థుల చేతిలో తండ్రి రాజారెడ్డి బలైనా, తనపైనా ఫ్యాక్షనిస్టు ముద్రపడినా మొక్కవోని ధైర్య విశ్వాసంతో ముందుకు సాగిన ధీరుడు.

ఆరు నూరైనా... బ్రహ్మాండం తలకిందులైనా తనను నమ్మిన వారికి కొంగు బంగారంలా వైఎస్‌ భాసించారు. కష్టకాలంలో అండగా నిలిచిన వారందరినీ ఆదుకున్నారు. మాట తప్పేది లేదు... మడమ తిప్పేది లేదని వైఎస్సార్ నిజ జీవితంలో ఆచరించి చూపాడు. 2004లో తొమ్మిది సంవత్సరాల తెలుగుదేశం పాలనను అంత మొందించి, అధికార పగ్గాలు స్వీకరించిన తర్వాత తాను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చాడు.

రైతులకు ఇచ్చిన హామీల్లో మొదటిదైనా ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశాడు. ఆ తర్వాత పేదలు మూడు పూటలా కడుపునిండా తినేందుకు వీలుగా కిలో బియ్యం రెండు రూపాయల పథకాన్ని ప్రవేశపెట్టి కోట్లాది పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహా మనిషి. కూలిపోయే గుడిసెల స్థానంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించిన వైఎస్.. కోట్లాది మంది జనులతో జోహార్ వైఎస్సార్ అనిపించుకున్నారు.

అలాగే, రాజకీయంగా ఎలాంటి పేరు ప్రఖ్యాతులు లేకపోయినా తన శిష్యుడైతే, అనుచరుడైతే చాలు... అతడికి ఏదో రకమైన మేలు చేసి ఓ గుర్తింపు వచ్చేలా చేశారు. ఇలా.. ప్రతి ఒక్కరి మనస్సులో తనకంటూ స్థానం సంపాదించుకుని.. తాను మాత్రం శాశ్వతంగా తిరిగిరాని లోకాలకు చేరుకున్న తెలుగింటి ముద్దుబిడ్డ మన వైఎస్సార్.

వెబ్దునియా పై చదవండి