వేడి వేడి కాలీఫ్లవర్ పరోటాను మామిడికాయ కాంబినేషన్‌తో చేసిన చేపల పులుసుతో కలిపి తింటే ఆ టేస్టే వేరు అనాల్సిందే.
కాలీఫ్లవర్ పరోటా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు - తయారు చేసే విధానం: కావలసిన పదార్థాలు:
గోధుమపిండి - రెండు కప్పులు, కాలీఫ్లవర్ తురుము - పావు కప్పు, సోంపు - ఒక టీస్పూన్, ఉప్పు - తగినంత, కొత్తిమీర తరుగు - పావు కప్పు, పచ్చిమిర్చి- రెండు (సన్నగా తరగాలి), ధనియాల పొడి - ఒక టీస్పూన్, గరం మసాలా - అర స్పూను, అల్లంపేస్టు - ఒక స్పూను.
తయారు చేసే విధానం:
ఓ అరగంట ముందుగా గోధుమ పిండిని తడిపి ఉంచుకోవాలి. క్యాలీఫ్లవర్ కడిగి సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఓ పాత్రను తీసుకొని అందులో సరిపడా కాలీఫ్లవర్ తురుము, ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం పేస్టు, ధనియాల పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల ముందే కాలీఫ్లవర్ మిశ్రమంలో కొంచెం గోధుమపిండిని గానీ, శనగపిండిని కాని కలిపితే తడి ఉండదు.
తడిపిన గోధుమ పిండిని చిన్న చిన్న చపాతీలుగా రుద్ది దానిపై, ఉండలుగా చేసుకున్న క్యాలీఫ్లవర్ మిశ్రమాన్ని ఉంచి చపాతీతో పూర్తిగా కప్పేసి మళ్లీ పరోటాల మాదిరిగా రొట్టెల పీటమీద వేసి రోల్ చేయాలి. ఇలా చపాతీలుగా చేసుకున్న వాటిని పెనం మీద తక్కువ మంటపై కాల్చాలి. పూర్తిగా వేగాకా దించే ముందు కాస్తంగా బటర్ (వెన్న) రాస్తే పరోటాలు రుచిగా వుంటాయి.
మామిడి చేపల పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు - తయారు చేసే విధానం: కావలసిన పదార్థాలు:
చేపలు - అరకిలో, మామిడి కాయ - ఒకటి, ఉల్లిపాయలు - నాలుగు, వెల్లుల్లి - చిన్న పాయ ఒకటి, జీలకర్ర - అర టీస్పూన్, ధనియాలు - 10 గ్రాములు, పచ్చిమిర్చి - ఆరు, కరివేపాకు - ఒక కట్ట, కొత్తిమీర - ఒక కట్ట, మిరపపొడి - ఒక టీస్పూన్, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారు చేసే విధానం:
మొదట చేపలు శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి వాటిపై ఉప్పు పట్టించి పక్కన ఉంచుకోవాలి. ఈలోగా ఉల్లిపాయలను మెత్తగా నూరుకొని ఒక పాత్రలో ఉల్లిపాయల పేస్ట్, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పొడి, కరివేపాకు, మిరపపొడి, కొత్తిమీరలను కలిపి మిశ్రమంగా చేసుకోవాలి.
ఇప్పుడు ఈ విశ్రమాన్ని ముక్కలుగా కట్‌చేసుకున్న చేపలకు పట్టించాలి. తరువాత మామిడికాయను ముక్కలుగా కోసి ఒక పాత్రలో నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకున్న ఈ మామిడికాయ మిశ్రమాన్ని చేపముక్కలు ఉడుకుతున్న పాత్రలో వేసి చిన్న మంటపై నెమ్మదిగా ఉడికించుకోవాలి. చేప ముక్కలు ఉడికాయని నిర్ధారించుకున్న తర్వాత దించుకోవాలి.