ఇ-మెయిల్స్ వెల్లువపై రామకృష్ణన్ మండిపాటు..!

FILE
రసాయనశాస్త్రంలో 2009 సంవత్సరానికిగానూ "నోబెల్ అవార్డు"ను పొందిన భారత సంతతి శాస్త్రవేత్త వెంకట్రామన్ రామకృష్ణన్ (57).. భారత్ నుంచి వెల్లువలా వచ్చిపడుతున్న ఇ-మెయిల్స్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనను అభినందిస్తూ భారతీయులు కుప్పలు తెప్పలుగా పంపుతున్న ఇ-మెయిల్స్‌తో తాను సతమతమవుతున్నట్లు ఆయన వాపోయారు.

పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఓ ఇ-మెయిల్ ఇంటర్వ్యూలో వెంకట్రామన్ మాట్లాడుతూ.. ఇలా భారతీయుల నుంచి వెల్లువలా వచ్చిపడుతున్న ఇ-మెయిల్స్‌తో తన మెయిల్ బాక్స్ నిండిపోతోందనీ.. వాటిని తొలగించేందుకు తనకు దాదాపు రెండు గంటల సమయం పడుతోందని వెంకట్రామన్ చిరాకుపడ్డారు.

మెయిల్స్ వెల్లువ కారణంగా.. తన సహచరులు, సైన్స్ జర్నల్స్ పంపే కీలకమైన సమాచారం మరుగున పడిపోతోందని వెంకట్రామన్ పేర్కొన్నారు. నోబెల్ పొందినందుకు అభినందనలు పంపించటం సరైనదే అయినప్పటికీ, ఇందుకోసం తనను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

అంతేగాకుండా... దశాబ్దాల తరబడి తానెవరో తెలియనివారు, తన బాగోగులు పట్టించుకోనివారు కూడా ప్రస్తుతం ఒక్కసారిగా తనతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వెంకట్రామన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇకమీదట అయినా తనను ఇబ్బందిపెట్టకుండా ఉండాలని ఆయన కోరారు.

వెబ్దునియా పై చదవండి