1. అశ్విని : మూడు నాలుగు పాదాలకు దోషం లేదు. అయినా నక్షత్రం సామాన్య దోషం అయినందువల్ల సామాన్య శాంతి శిశువు ముఖాన్ని మంత్రాలను ఉచ్చరిస్తూ నూనెలో తండ్రి చూడాలి. ఈ నక్షత్రంలో అబ్బాయి పుడితే ధనవంతుడు, శౌర్యవంతుడు, అధికమైన వినయము, బుద్ధిగలవాడుగా, సమర్థుడుగా వుంటాడు. కీర్తి, సుఖము, గొప్ప శరీరము కలిగినవాడుగా వుంటాడు. అమ్మాయి పుడితే వ్యవహారాల్లో నేర్పు కలిగినదిగా, బలవంతురాలుగా, అహంకారం కలిగినదిగా వుంటుంది.
2. భరణి : మొదటి పాదము, రెండో పాదము, నాల్గవ పాదాలలో జన్మించిన వారికి దోషము లేదు. మూడో పాదంలో పుత్ర జననమైన ఆ శిశువుకు, తండ్రికి దోషము వస్తుంది. అలాగే అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి, తల్లికి దోషము వస్తుంది. ఈ దోషము 27 రోజులుంటుంది. ఈ దోష శాంతికి మహన్యాస రుద్రాభిషేకము, నక్షత్ర నవగ్రహ జపాలు, దానాలు, చేయించాలి.
ఈ నక్షత్రంలో మొదటిపాదము, రెండవ పాదము, మూడవ పాదాలలో జన్మించిన వారికి దోషము లేకపోయినా, నక్షత్ర దోషమైనందువల్ల సామాన్య శాంతి శిశువు యొక్క ముఖమును మంత్రములతో నూనెలో తండ్రి చూడాలి. అబ్బాయి అయితే విద్యావంతుడు, ఆరోగ్యవంతుడు, బుద్ధిమంతుడు, యదార్థము మాట్లాడువాడు, దృఢమగు వ్రతం కలవాడుగా అవుతాడు. అదే అమ్మాయి అయితే మిక్కిలి సుఖపడుతుంది, హాస్యంగా మాట్లాడును, తల్లిదండ్రులను పూజించును.
3. కృత్తిక : మొదటిపాదం, రెండవపాదం, నాలుగవ పాదంలో జన్మించినట్టివారికి దోషము లేదు. మూడవ పాదంలో అబ్బాయి పుడితే ఆ శిశువుకు, తండ్రికి దోషము వుంటుంది. అలాగే అమ్మాయి అయితే ఆమెకి, ఆమె తల్లికి దోషము కలుగుతుంది. ఈ దోష శాంతికి మహాన్యాస రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపాలు, దానాలు, చేయించాలి.
ఈ నక్షత్రంలో ఒకటి, రెండు, నాలుగు పాదాలలో జన్మించిన వారికి సామాన్య శాంతి, శిశువు యొక్క ముఖాన్ని మంత్రాలతో తండ్రి చూడాలి. అబ్బాయి పుడితే గంభీరంగా వుండేవాడిగా, అభిమానము కలవాడుగా అవుతాడు. అమ్మాయి పుడితే కీర్తివంతురాలు, తోజోవతి, కోపం అధికంగా కలదిగా, శ్లేష్మతత్వ శరీరం గలదిగా వుండును.
4. రోహిణి - మొదటి పాదములో శిశువు జననమైన తల్లికి, మేనమామలకు దోషము వస్తుంది. రెండవ పాదములో పుడితే తల్లికి, తండ్రికి, మేనమామలకు దోషము కలుగుతుంది. మూడవ పాదములో జననమైతే తల్లికి, మేనమామలకు, నాలుగవ పాదములో కూడా మేనమామలకు దోషము కలుగుతుంది.
కాబట్టి ఈ నక్షత్రంలోని ఏ పాదంలో పుట్టినా మహాన్యాస రుద్రాభిషేకము, నక్షత్ర నవగ్రహ జపములు, దానాలు, సువర్ణ దానము చేయించాలి. అబ్బాయి పుడితే మంచి రూపం కలవాడై, స్థిరమైన బుద్ధి కలవాడుగా, అభిమానము గలవాడుగా, సౌఖ్యమును అనుభవించును. సమర్థుడు, తేజోవంతుడు, రతిప్రియుడు, భోగి అవుతాడు. అదే అమ్మాయి అయితే ఈమెకు అమ్మాయిలు, అబ్బాయిలు పుడుతారు. రూపవంతురాలు, కీర్తి ప్రతిష్టలు కలిగినది, దీర్ఘాయుష్షు కలిగినదిగా వుంటుంది.
5. మృగశిర - ఈ నక్షత్రంలోని ఓ పాదములో పుట్టినా కూడా దోషము లేదు. శుభప్రదము. అబ్బాయి అయితే ధనవంతుడు, ఉత్సాహవంతుడు, శత్రువులను జయించువాడు, పెద్ద పెద్దకార్యములు సాధించువాడు, పరిశుద్ధుడు, వేదాలను తెలిసినవాడుగా అవుతాడు. అమ్మాయి అయితే, సౌందర్యం కలిగినది, సంతోషము గలది, గౌరవ ప్రతిష్టలు కలిగినది, ధర్మకార్యములు చేయునదిగా, పుత్ర సంతానము కలిగినదిగా వుండును.
6. ఆరుద్ర - ఈ నక్షత్రంలో కూడా ఏ పాదములో పుట్టినా కూడా దోషమనేది లేదు. శుభము. అబ్బాయి పుడితే శౌర్యవంతుడు, క్రయవిక్రయాలందు సమర్థుడు, చేసిన మేలు మరచువాడు, క్రూర కార్యములు చేయువాడు, చింతలేనివాడుగా అవుతాడు. అమ్మాయి అయితే, కలహ ప్రియురాలుగా, పాపకార్యాలు ఒడిగట్టే మనసత్త్వం కలిగి ఉంటుందని జ్యోతిష్క శాస్త్రం పేర్కొంటుంది.