మీది మకర లగ్నమా? అయితే ఇలా ఉంటారు..!

WD
మకర లగ్నంలో జన్మించిన వారు దేహబలంతో, ధైర్యంతో ధృడమనస్కులైయుంటారు. ఎలాంటి కార్యానైనా సులభంగా పూర్తి చేస్తారు. అనుకున్న కార్యాన్ని సద్వినియోగంగా పూర్తి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తారు. ఎల్లప్పుడూ ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటారు. విరామం అంటే వీరికి ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఇతరుల మాటలకు మర్యాద ఇచ్చేటట్లు నటిస్తూనే.. ఆ మాటల్లో ఎంతవరకు సత్యముందని లోతుగా పరిశీలించి కార్యచరణ చేస్తారు.

ఇతరుల్ని సామాన్యంగా నమ్మని స్వభావం కలిగిన మకర లగ్న జాతకులు.. బంధువులు, ఇతరుల వద్ద అప్రమత్తంగా ప్రవర్తిస్తారు. అయితే ఆత్మవిశ్వాసం వీరిలో కొంత తక్కువగానే ఉంటుంది. స్వార్థపూరితంగా వ్యవహరించే ఈ జాతకులు ప్రతి కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు సాయశక్తులా కృషి చేస్తారు.

ఏదైనా సమస్యను కలిగించే కార్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టేందుకు సంకోచిస్తారు. అప్పటికప్పుడు నిర్ణయాలను మార్చుకోవడంలో ఏ మాత్రం ఆసక్తి చూపరు. తమ నిర్ణయమే నెగ్గాలనే స్వభావంతో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరులను తమ ఆధీనంలో ఉంచుకుని అధికారం చెలాయిస్తారు.

సాధారణంగా మకరలగ్నంలో పుట్టిన జాతకులు సాత్త్వికులుగా దర్శనమిస్తారు. ఇంకా ఆకర్షణీయమైన రంగుతో ఇతరులను ఆకట్టుకంటారు. ఎటువంటి వాగ్వివాదాల జోలికి వెళ్లరు. అయితే ఇతరులకు తమ జోలికి వస్తే మాత్రం వారితో పోరాడి జయించే వరకు ఊరుకోరు. చిన్నవిషయాన్ని కూడా పెద్దగా జోడించి చెప్పడంలో వీరికి వీరే సాటి. తమ గురించి తామే గొప్పగా చెప్పుకునే స్వభావాన్ని కలిగియుంటారు.

ఇంకా ఈ మకర లగ్నంలో పుట్టిన జాతకులకు బ్రౌన్, పసుపు రంగులు కలిసొస్తాయి. అలాగే బుధవారం వీరికి అన్ని విధాలా అనుకూలిస్తుంది. శుక్ర, శనివారాలు సామాన్య ఫలితాలనిస్తాయి. అయితే మంగళవారం మాత్రం అశుభమైన రోజు. కాగా.. 5, 14, 23, 32, 41, 50, 59, 68, 1, 4, 6, 7 వంటి సంఖ్యలు అనుకూలిస్తాయి. అయితే 2, 3, 8, 9 సంఖ్యలు వీరికి కలిసిరావు.

వెబ్దునియా పై చదవండి