ఇవే కాకుండా ఈ పండగకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రోజు చేసే యజ్ఞయాగాది క్రతువులూ, పూజలు, జపాలు అక్షయమైన ఫలితాలనిస్తాయి. ఇదే విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్టుగా మత్స్యపురాణం వివరిస్తోంది. అక్షయ తృతీయనాడు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలానిస్తాయని నారద పురాణం చెబుతోంది.
కురు సభలో తనకు జరుగుతోన్న అవమానానికి నీవే దిక్కంటూ చేతులు జోడించి వేడుకున్న ద్రౌపదికి దేవదేవుడు అక్షయంగా చీరలు ఇచ్చిందీ ఈ రోజే. మహాభారత కావ్యాన్ని వేదవ్యాసుడు రాయడం ప్రారంభించిందీ, శివుని జటాజూటం నుంచీ భూలోకానికి గంగ చేరింది కూడా ఈ సుదినమే.
అలాగే శ్రీకృష్ణుడి స్నేహితుడైన సుదామా.. తన పాడైన అటుకులు తీసుకోని శ్రీకృష్ణుడిని కలవడానికి వస్తాడు. ఇక సుదామా పరిస్థితి తెలుసుకున్న కృష్ణుడు అతనికి అష్ట ఐశ్వర్యాలు కురిపిస్తాడు. దీంతో సుదామా భాధలు, పేదరికం మొత్తం తొలగిపోతుంది. ఈ సంఘటన తృతీయ తిథి.. వైశాఖ, శుక్ల పక్షాలలో జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.
అంతటి విశిష్టత ఉన్న ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటు స్నానం చేసి, విష్ణుమూర్తిని పూజించాలి. పూజలోని అక్షితలు తలమీద వేసుకుని, శక్తిమేర దానధర్మాలు చేయాలి.
కొందరు ఈ రోజు వైశాఖ పూజ చేస్తారు. ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించే మజ్జిగ, పానకం, చెప్పులు, గొడుగు, మామిడి పండ్లు, వస్త్రాలు, గంధం దానం చేస్తారు. ఎండలు మండిపోయే వైశాఖంలోని ఈ పుణ్యదినాన ఎవరి గొంతు చల్లబరచినా, ఎవరికైనా కాస్త దానం చేసినా ఆ ఫలితం అక్షయమవుతుంది.