వివాహ జీవితం విజయవంతం కావాలంటే??

శుక్రవారం, 13 జులై 2012 (16:49 IST)
File
FILE
చాలా మంది యువతీ యువకులు వివాహం అనే మాటెత్తితే హడలిపోతుంటారు. తమను అర్థం చేసుకునే భర్త/భార్య వస్తుందో రాదోనని బెంగపెట్టుకుంటారు. నిజానికీ.. వివాహం జీవితం అనేది భార్యాభర్తల అన్యోన్యత, ఇచ్చిపుచ్చుకునే ధోరణి, వారిద్దరి మధ్య అవగాహనపై ఆధారపడి ఉంటుంది. అసలు వివాహమైన భార్యాభర్తల వైవాహిక జీవితం విజయవంతం కావాలంటే ఏం చేయాలన్న అంశాలను పరిశీలిద్ధాం.

కొత్త దంపతులు కనీస సూత్రాలు, విలువలు, ప్రవర్తనా సరళులు అవలంభిస్తే వారి దాంపత్యం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతుందని మానసిక నిపుణులు చెపుతున్నారు. ఎప్పుడూ భాగస్వామిని అదే పనిగా విమర్శించకూడదని చెపుతున్నారు. అతని లేదా ఆమె ప్రవర్తనా సరళిని, ధోరణులకు మాత్రమే సున్నితంగా విమర్శలు చేయండి.

ఏ విషయంలోనైనా సూటిగా, నిజాయితీగా ఉండటం ముఖ్యం. నువ్వేం అనుకుంటావో అదే సున్నితంగా, స్పష్టంగా చెప్పాలి, చెప్పేదే చెయ్యాలి. ఇద్దరి మధ్య పరస్పర భావవినిమయం అంటే ఒకరికొకరు ఏమనుకుంటున్నారో, సరైన పదాలలో తరచూ చెప్పుకొంటూ, మాట్లాడుకుంటూ ఉండాలి. ఇంట్లో వీలు కాకపోతే వారానికొక రోజు ఎక్కడికైనా వెళ్ళి సమీక్షించుకోవాలి.

భార్య/భర్త చెప్పేది శ్రద్ధగా వినటం వల్ల ఒకరికొకరు ఎంత విలువైన వారో పరస్పరం అర్థం అవుతుంది. పరస్పరం చిన్న చిన్న విషయాలకు అభినందించుకోవటం గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. చర్చించుకోవటం చాలా ముఖ్యం. అభిరుచులు కలిసిన అంశాలలో ఇద్దరూ కలిసి అభిప్రాయాలు పంచుకొంటూ ఉండాలి.

ముఖ్యంగా భర్త భార్యను తన ఆస్తిగానో, తనకు లైంగిక సుఖాన్ని ఇచ్చే వస్తువుగానో లేదా పిల్లల్ని కనే ఒక యంత్రంగానో, ఇంటి పని, వంట పని చేసే పని మనిషిగానో చూడటం మానేసి సమానమైన విలువ ఇవ్వాలి. అధికార సంబంధాల్లో, యజమాని - బానిస సంబంధాల్లో ప్రేమ ఉండదు.

పిల్లల పని, ఇంటి పని, వంట పని భార్యతో కలిసి చెయ్యడం లాంటి శ్రమ విభజన భార్యకు భర్తపట్ల ఎనలేని గౌరవాన్ని, ప్రేమను పెంచుతుంది. పెరిగే పిల్లలకు తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని పెంచడమే కాదు, ఒక నూతన ప్రజాస్వామిక సంస్కృతిని అందించిన వారవుతారు. పిల్లలను మంచి వ్యక్తులుగా సమాజంలో తీర్చిదిద్దిన వారూ అవుతారు.

భర్తతో శృంగారం విషయంలో, పిల్లల్ని కనే విషయంలో భార్యకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉండాలి. ఆ రకమైన వాతావరణాన్ని భర్త ఏర్పరచాలి. ఆమె హక్కుల్ని విధిగా గౌరవించాలి. ఇలాంటివన్నీ పరస్పరం ప్రేమానురాగాలను పెంచి, సంసారం సాఫీగా సాగడానికి ఉపకరిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి