క్రీ.శ.1512 సంవత్సరం నాటి శాసనాల్లో ఈ గరుడ మందిరం యొక్క ప్రస్తావన ఉంది. ఈ మందిరంపై మూడు బంగారు కలశాలు గల గోపురం నిర్మించబడింది. వెండి వాకిట్లో నుంచి లోపలికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు గరుడ మందిరం వెలుపల, పక్కల వెనుక భాగంలో బంగారు పూతపూయబడిన రేకు తాపబడి ఉంటుంది. సరిగ్గా ఈ గరుడాళ్వార్ మందిరం యొక్క వెనుకభాగంలోని ప్రాకార కుడ్యంపై అంటే వెండివాకిలికి ఎదురుగా అమర్చబడిన శ్రీ రంగనాథుని బంగారు విగ్రహం కూడా ఉంది.
అలాగే ఆలయంలో నెలకొని ఉన్న మరికొన్ని గరుడ విగ్రహాల్లో రాముల వారి మేడలో ఉన్న చిన్నచిన్న పంచలోహ గరుడ విగ్రహం కూడా ఉంది. రంగనాయక మండపంలోని వెండి గరుడ వాహనం, బంగారు గరుడ వాహనం కూడా ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామివారు ప్రతి బ్రహ్మోత్సవంలో బంగారు గరుడునిపై ఊరేగే గరుడసేవ ఎంతో వైభవోపేత మహోత్సవం.