తిరుమల శ్రీనివాసుని ఆర్జిత సేవల గురించి తెలుసుకుందామా
మంగళవారం, 23 ఆగస్టు 2016 (23:00 IST)
ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం వేలాదిగా తిరుమలకు వస్తూ పోతూ ఉంటారు. అయితే ఇప్పటికీ చాలామందికి స్వామివారికి నిత్యం నిర్వహించే ఆర్జిత సేవల గురించి తెలియదు. చాలామందికి సుప్రభాతం, అర్చన లాంటివి మాత్రమే తెలుసు. కానీ ఎన్నో రకాల సేవలు స్వామివారికి ప్రస్తుతం ఆలయంలో జరుగుతున్నాయి. ఏయే సమయాల్లో జరుగుతాయో ఇప్పుడు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సుప్రభాతం : ప్రతిరోజు ఉదయాన్నే సుప్రభాతంతో శ్రీవారి ఆలయంలో నిత్య పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. వేద పండితులు వేదమంత్రోచ్ఛారణలతో సుప్రభాతాన్ని పఠిస్తారు.
తోమాలసేవ: సుప్రభాతం తరువాత ప్రతిరోజు తోమాల సేవను శ్రీవారికి నిర్వహిస్తారు.
అర్చన : తోమాల సేవ తరువాత ప్రతిరోజు అర్చన జరుగుతుంది.
ఏకాంత సేవ : సర్వదర్శనం అయిన తరువాత ప్రతిరోజు రాత్రి ఏకాంతసేవ జరుగుతుంది.
నిజపాద దర్శనం : ప్రతి శుక్రవారం అభిషేకానంతరం స్వామివారి పాదములను దర్శించుకోవచ్చు. అదే నిజపాద దర్శనం.
ఇక సేవల వివరాలు పరిశీలిస్తే...
అభిషేకం : వక్షస్థలంపై లక్ష్మీదేవితో ఉన్న మూలవిరాట్టుకు శుక్రవారం రోజు పలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం వైభవోపేతంగా నిర్వహిస్తారు. పునుగు, జవ్వాది, కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యములతో పాత్రను భక్తులు హస్తములతో స్పర్శించిన తరువాత అభిషేకాన్ని నిర్వహిస్తారు.
వస్త్రాలంకార సేవ : ప్రతి శుక్రవారం జరుగు అభిషేకం తరువాత స్వామివారికి వస్త్రాలంకార సేవ జరుగుతుంది.
సహస్ర కలశాభిషేకం : ప్రతి బుధవారం ఉదయం సహస్ర కలశములతో అభిషేకం నిర్వహిస్తారు.
తిరుప్పావడ సేవ : ప్రతి గురువారం ఉదయం జరిగే ప్రత్యేక సేవ ఇది. అన్న ప్రసాదములు స్వామివారికి నివేదన జరుపబడుతాయి.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం : ఇది ప్రతి సంవత్సరం ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి రోజులకు ముందుగా వచ్చే మంగళవారాలలో ఉదయాన్నే జరుగుతుంది. గర్భగుడిని శుద్ధి చేసే ప్రక్రియ ఇది.
వసంతోత్సవం : ఏడాదికి ఒకమారు చైత్ర మాసంలో మూడురోజులు జరుగుతుంది.
పవిత్రోత్సవం : శ్రీవారి నిత్యపూజా నివేదనాదులలో తెలిసీతెలియక జరిగే దోషాల పరిహారార్థం జరిపే పవిత్రీకరణ. ఇది మూడురోజుల పాటు జరుగుతుంది. సాధారణంగా ఆగస్టు మాసంలో జరుపుతారు.
పుష్పయాగం : ప్రతి యేటా బ్రహ్మోత్సవం తరువాత వచ్చే శ్రవణా నక్షత్రము రోజున పుష్పయాగం జరుగుతుంది. ఇది శ్రీవారికి పలు రకాల పుష్పాలతో జరిపే అర్చన.
తెప్పోత్సవం : ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో స్వామివారి పుష్కరిణిలో తెప్పోత్సవం జరుపుతారు. ఇది ఐదురోజులు జరిగే ఉత్సవాలు.
అభిధేయక అభిషేకం: జ్యేష్ట మాసంలో మూడు రోజులు జరిగే ఉత్సవం.
పద్మావతి పరిణయము : ఇది వైశాఖ శుక్ల, నవమి, దశమి, ఏకాదశి రోజులలో జరిగే మూడురోజుల కళ్యాణోత్సవం.
పుష్పపల్లకి : జూలై నెలలో జరిగే ఆణివార ఆస్థానం రోజున సాయంత్రం శ్రీవారిని, అమ్మవారిని పుష్పపల్లకీలో వూరేగించే ఉత్సవం.
కళ్యాణోత్సవం : స్వామివారికి, అమ్మవారికి ప్రతిరోజు(బ్రహ్మోత్సవం, పవిత్రోత్సవం, గ్రహణాది సమయాలలో తప్ప) భక్తులు జరిపించే ఉత్సవం కళ్యాణోత్సవం.
బ్రహ్మోత్సవం : శ్రీనివాసుని ఉత్సవమూర్తి అనగా మలయప్పస్వామి వారికి పూజ జరిపి వేద మంత్రాలతో మూడు వాహనాలపై(శేష, గరుడ, హనుమంత)ఊరేగిస్తారు. ఇది సంక్షిప్తంగా జరిగే బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం తరువాత దీన్ని నిర్వహిస్తారు. శ్రీనివాసుని మూడు వాహన సేవలను విడివిడిగా కూడా చేయించవచ్చు.
డోలోత్సవం : శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికి అద్దాల మహలులో ఉన్న ఊయలపై వేంచేపు చేసి మంగళ వాయిద్యాలతో వేద పారాయణులతో ఊయల ఊగించే ఉత్సవం.
సహస్ర కలశాభిషేకం: ఐహిక, ఆముష్మిక, అభ్యున్నతికై శ్రీనివాసునికి భక్తులు జరిపించే ప్రత్యేక ఆర్జిత సేవ. ఇది ఉదయకాలంలో జరిగే సేవ.