అందరివాడు... ఆపదమొక్కులవాడు... గోవిందుడు...

ఆదివారం, 27 జనవరి 2008 (15:55 IST)
WD PhotoWD
గోవింద నామ స్మరణం సర్వపాపహరణం. ఏడుకొండల వాడా, వెంకటరమణా, గోవిందా, గోవిందా అని పిలుచుకుంటూ భక్తులు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకుంటారు. స్వామివారి దర్శనం క్షణ కాలం లభించిన కాలం, జన్మ ధన్యమైపోయిందన్న భావనతో భక్తులు వారి స్వస్థలాలకు చేరుకుంటూ ఉంటారు. సైన్సులో పేర్కొన్న గురుత్వాక్షరణ శక్తిని మించిన ఆధ్యాత్మిక శక్తితో మూర్తీభవించిన దైవ శక్తిగా మహావిష్ణువు మరో అవతారంగా తిరుమలలో వెలసిన శ్రీవారిని దర్శించేందుకు వస్తున్న భక్తుల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి 50,000 మంది భక్తులు వస్తుంటారు. పర్వదినాలు, దేవాలయ ఉత్సవాల సమయంలో భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది.

స్థల పురాణం:
ఏడు పడగల ఆదిశేషుని పోలి ఉండే రీతిలో అగుపించే ఏడు కొండలలో ఒకటైన వెంకటాద్రి పర్వతంపై స్వామి అవతరించారు. ఒకానొక పురాణాన్ని అనుసరించి క్రీస్తు శకం 11వ శతాబ్దంలో జన్మించిన రామానుజాచార్యులవారు ఏడు కొండలను ఎక్కుతుండగా శ్రీనివాసునిగా పిలవబడే శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ఆయనను ఆశీర్వదించినట్లు చెప్పబడింది. స్వామి ఆశీర్వాదంతో 120 సంవత్సరాలు జీవించిన రామానుజాచార్యులవారు స్వామి వారి లీలలను ప్రపంచానికి చాటి చెప్పారు. వైకుంఠ ఏకాదశినాడు స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. అందుకు అనుగుణంగా ఆరోజు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలేశుని దర్శించుకుని మోక్షమార్గాన్ని ప్రసాదించమని వేడుకుంటారు.

దేవాలయ చరిత్ర:
దేవాలయ చరిత్రను పరిశీలించినట్లయితే... కాంచీపురాన్ని పరిపాలిస్తున్న పల్లవరాజులు క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని పునరుద్ధరించినట్లు
WD PhotoWD
చెప్పబడింది. కానీ 15వ శతాబ్దంలో విజయనగర రాజుల పాలన వరకు కూడా దేవాలయం ప్రాచుర్యం పొందలేదు. వారి పాలనలో దేవాలయం అత్యంత ప్రాచుర్యం పొందింది. అనంతర కాలంలో హాతీరామ్‌జీ మఠానికి చెందిన మహంత్‌లు దేవాలయ నిర్వహణ బాధ్యతలను చూసుకునేవారు.

తరువాత మద్రాసు రాష్ట్రం 1933లో స్వయంప్రతిపత్తి గల ఒక పాలకవర్గాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పేరిట ఏర్పాటు చేసింది. తదనంతర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ధర్మకర్తలతో పాలక మండలిని ప్రభుత్వం నెలకొల్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఒక కార్యనిర్వహణాధికారి దేవాలయ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు.

WD PhotoWD
ప్రధాన దేవాలయం:
వెంకటాద్రి పర్వతంపై శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం కొలువై ఉంది. తరతమ బేధాలు లేకుండా అన్ని మతాలకు చెందిన వారిని గర్భగుడిలోకి అనుమతించే దేశంలోని ఏకైక దేవాలయంగా స్వామి ఆలయం సర్వజనుల పూజలను అందుకుంటోంది. పురాణాలను అనుసరించి కలియుగంలో మానవులకు ముక్తిని ప్రసాదించే కలియుగదైవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి అవతరించినట్లు చెప్పబడింది.

ఆపదలమెక్కువానికి భక్తుల మొక్కులు:
తాము తలచినది జరిగిన పక్షంలో తిరుపతి నుంచి వెంకటాద్రి పర్వతంపై గల తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తామని భక్తులు మొక్కుకుంటారు. భక్తుల మొక్కులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అలిపిరి నుంచి తిరమలు ప్రత్యేక మెట్ల మార్గాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక కమిటీ వారు నిర్మించారు.

స్వామివారికి తలనీలాల సమర్పణ:
తిరుమలకు చేరుకున్నాక భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకోవడమనేది అనాదిగా అమలవుతున్న ఆచారం. స్వామివారికి మొక్కులు తీర్చుకోవడంలో తలనీలాలు సమర్పించడమనేది ఒక భాగం. తమలోని అహంకారాన్ని నశింపజేయమని కోరుకునే ప్రయత్నంలో భాగంగా భక్తులు స్వామివారికి
WD PhotoWD
తలనీలాలు సమర్పించుకుంటారు. దేవాలయానికి సమీపంలో గల కళ్యాణ కట్టగా పిలవబడే భారీ భవనంలో తలనీలాలను సమర్పించుకోవచ్చు. తలనీలాలు సమర్పించుకున్న అనంతరం స్నానాదికాలు కానిచ్చి భక్తులు దర్శనానికి వెళతారు.

స్వామివారి దర్శనం:
భక్తులు తమ ఆర్థిక స్తోమతను అనుసరించి దేవస్థానం వారు నిర్వహిస్తున్న పలు దర్శన పథకాల ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు. దేవాలయ ప్రధాన ద్వారం నుంచి వికలాంగులు దర్శనానికి వెళ్లే అవకాశాన్ని దేవస్థాన నిర్వాహకులు కల్పించారు.

WD PhotoWD
లడ్డు ప్రసాదం:
స్వామి వారి ప్రసాదమైన లడ్డుతో ఇంటికి చేరితేనే తమ తీర్థయాత్ర సంపూర్ణమైనట్లు భక్తులు భావిస్తుంటారు. స్వామివారికి వెళ్లే క్యూలలో భక్తులు పొందిన దర్శన స్థాయికి సంబంధించిన టిక్కెట్టుకు అనుగుణంగా లడ్డు టోకెన్లను కౌంటర్లలో వారు అందిస్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని సర్వదర్శన భక్తులు, ప్రతి భక్తునికి ఒక లడ్డు టోకెన్‌ను రొక్కం పుచ్చుకుని అందిస్తారు. దర్శనానంతరం భక్తులు దేవాలయం వెలుపల ఏర్పాటు చేసిన కౌంటర్లలో టోకెన్లను సమర్పించి లడ్డూలను పొందవచ్చు. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, తెప్పోత్సవం, పవిత్రోత్సవాలకు భక్తుల లక్షల సంఖ్యలో విచ్చేస్తారు.

స్వామి సన్నిధిలో శుభకార్యాలు:
స్వామి సన్నిధిలో శుభకార్యాలు జరుపుకోవాలనుకునే భక్తుల సౌకర్యార్ధం తిరుమల తిరుపతి దేవస్థానం పురోహితుల సంఘాన్ని ఏర్పాటు చేసింది. వివాహాలు, నామకరణం, ఉపనయనం తదితర శుభకార్యాలను సంఘానికి చెందిన పురోహితులు దక్షిణ, ఉత్తర భారత సాంప్రదాయాలను అనుసరించి నిర్వహిస్తుంటారు.

వసతి సౌకర్యాలు: భక్తుల సౌకర్యార్థం తితిదే పాలకమండలి ఉచిత వసతి గృహాలను నిర్మించింది.

చేరుకునే మార్గం: తిరుపతి నగరం చెన్నైకు 130 కి.మీ.ల దూరంలో ఉంది. హైదరాబాద్, బెంగుళూరు నగరాల నుంచి ఇక్కడకు రైలులో చేరుకోవచ్చు.
WD PhotoWD


విమానమార్గం : తిరుపతిలో గల చిన్నపాటి విమానాశ్రయానికి హైదరాబాద్ నుంచి మంగళవారం, శనివారాలలో విమాన సర్వీసులు కలవు. తిరుపతికి అతి సమీపంలో గల చెన్నై నగరం నుంచి ప్రతి రోజు రెండు విమాన సర్వీసులు కలవు. విమానశ్రయం నుంచి తిరుమలకు భక్తులను చేరవేసే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను నడుపుతోంది.