ఆపద మొక్కులవాడు, అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామికి సోమవారం పుష్పయాగం కన్నుల పండుగగా జరిగింది.
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తితిదే ఆధ్వర్యంలో జరిగిన ఈ పుష్పయాగంలో పదివేల టన్నుల పుష్పాలను ఉపయోగించారు. భక్తులు తమ కిష్టమైన పుష్పాలను స్వామివారికి సమర్పించి.. వెంకన్న అనుగ్రహం పొందారు.
సోమవారం ఉదయం అభిషేకంతో 8 గంటలకు ప్రారంభమైన పుష్పయాగం భక్తుల గోవిందనామస్మరణల మధ్య పుష్పయాగం ఘనంగా జరిగింది. ఆలయంలోని సంపంగి ప్రాకారంలో పుష్పయాగం కోసం కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి అర్చకులు హోమాలు, తిరుమంజనంతో పాటు వివిధ రకాల పరిమళ భరిత పుష్పాలతో అర్చన గావించారు.
పుష్పయాగాన్ని పురస్కరించుకుని సోమవారం నాటి తోమాల-అర్చన, విశేష పూజ, కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం తదితర సేవలను తితిదే రద్దు చేసింది.
ఈ పుష్పయాగ ఉత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. తొలుత శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుల వారికి సమర్పణ అనంతరం తిరుచ్చి వాహనంపై అధిష్టించి నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు.
నైరుతిమూలలోని వసంత మంటపం ప్రాంతం నుంచి పాలికలలో పుట్టమన్నును సేకరించారు. యాగశాలలో హోమాది కార్యక్రమాల తర్వాత నవధాన్యాల పాలికల్లో అంకురింపజేయడంతో అంకురార్పణ కార్యక్రమం పూర్తయ్యింది.