డాలర్ శేషాద్రికి ఉద్వాసన? ఒక్క జీవోతో వేటు (video)

గురువారం, 31 అక్టోబరు 2019 (16:23 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పేరు చెబితే ఠక్కున గుర్తుకువచ్చేది తొలుత శ్రీవారు. ఆ తర్వాత డాలర్ శేషాద్రి. ఎన్నో దశాబ్దాలుగా ఆయన స్వామివారి సేవకు అంకితమైపోయారు. అలాంటి డాలర్ శేషాద్రిపై విమర్శలతో పాటు.. ప్రశంసలు కూడా ఉన్నాయి. 
 
నిజానికి తితిదేలో పదేళ్ల క్రితమే పదవీ విరమణ చేసిన డాలర్‌ శేషాద్రి ఇప్పటికీ స్వామి వారి సేవలోనే కొనసాగుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన 2323 నంబరు జీవోతో ఆయనపై కూడా వేటుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే సుదీర్ఘకాలం నుంచి ఉన్న డాలర్‌ శేషాద్రి సేవలకు ముగింపు పలికినట్టే.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్ర ప్రభుత్వం తాజా జీవో మేరకు ఈ యేడాది మార్చి 31లోగా పదవీ విరమణ చేసి కొనసాగింపులో ఉన్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టడంలో నిమగ్నమయ్యారు.
 
ఇలా విధుల్లో కొనసాగుతున్న సిబ్బందిని గుర్తించి నివేదిక ఇవ్వాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. దీని ప్రకారం ఈరోజు రాత్రిలోపు 60 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో డాలర్‌ శేషాద్రితోపాటు, టీటీడీ ఇటీవల చేసిన 12 మంది ఉద్యోగాల నియామకాలు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు