ధర్మప్రచారంలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి ఇతర వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి, పురాతన ఆలయాల పరిరక్షణకు శ్రీవాణి ట్రస్టు ద్వారా విరాళాలు స్వీకరిస్తున్నామని, విరాళాలిచ్చే దాతలకు ప్రివిలేజ్‌గా విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తామని టిటిడి అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని గోకులం విశ్రాంతిగృహంలో గల సమావేశమందిరంలో సోమవారం అదనపు ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్టుకు విరాళాలిచ్చే దాతలకు బ్రేక్ దర్శన టికెట్లు ఇచ్చే విధానాన్ని సోమవారం నుండి నలుగురు దాతలతో ప్రారంభించామని వెల్లడించారు. ఇందుకోసం గోకులం విశ్రాంతి గృహంలో ఆఫ్‌లైన్‌లో సింగిల్ విండో కౌంటర్‌ను ప్రారంభించామని తెలిపారు. నవంబరు మొదటి వారంలో ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను ప్రారంభిస్తామని, ఆ తరువాత ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ఆన్‌లైన్‌లో విరాళాలందించవచ్చని చెప్పారు.
శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళమిచ్చే దాతలకు ఒక బ్రేక్ దర్శన టికెట్ ప్రివిలేజ్‌గా ఒకసారి మాత్రమే అందిస్తామని, వెంటనే సదరు దాతలు రూ.500 చెల్లించి బ్రేక్ దర్శన టికెట్ కొనుగోలు చేయవచ్చని వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టుకు దాతలు ఒక రూపాయి నుండి ఎంతమొత్తమైనా విరాళంగా అందించవచ్చని రూ.10 వేల నుండి టిటిడి కల్పించే ప్రయోజనాలు వర్తిస్తాయని తెలిపారు. రూ.10 వేలకు ఒక బ్రేక్ దర్శన టికెట్ చొప్పున 99 వేల వరకు 9 టికెట్లను దాతలు పొందే అవకాశముందన్నారు.
ఒక లక్ష పైన విరాళాందించే దాతలకు టిటిడి ఇదివరకే పలు ట్రస్టులు, స్కీమ్‌లకు అందిస్తున్న తరహాలోనే ప్రయోజనాలను వర్తింపచేస్తామని వివరించారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ప్రారంభించామని, భక్తుల స్పందనను దృష్టిలో ఉంచుకుని కోటా నిర్ణయిస్తామని, ఒక నెల ముందే ఈ కోటాను తెలియజేస్తామని అదనపు ఈవో తెలిపారు. కాగా... శ్రీవాణి ట్రస్టుకు చెన్నైకి చెందిన రామయ్య రూ.40 వేలు విరాళంగా అందించారు. దీంతోపాటు ఒక్కో టికెట్‌కు రూ.500 చెల్లించి 4 బ్రేక్ దర్శనం టికెట్లు పొందారు. సమావేశంలో టిటిడి ఐటి విభాగాధిపతి శేషారెడ్డి పాల్గొన్నారు.