యమ లోకములో హైఅలర్ట్... ఉన్నతాధికారులతో యముడు సమీక్ష...

బుధవారం, 27 డిశెంబరు 2017 (21:36 IST)
రద్దీ నేపథ్యంలో 
యమలోకం అప్రమత్తమయ్యింది ..
ఉన్నతాధికారులతో యముడు సమీక్ష నిర్వహించారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  
తప్ప తాగి ప్రమాదాల్లో  పోయే కుర్రాళ్ళను 
ఎప్పటికప్పుడు తీసుకువచ్చేందుకు 
సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశించారు..
అవసరమైతే దినసరి వేతనానికి అదనపు 
సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు...
మద్యం అలవాటు వున్న భటులను 
భూలోకానికి పంపించవద్దని సూచించారు.  
ఆసుపత్రులు.. గొడవలు జరిగే ఏరియాల్లో 
ప్రత్యేక దళాలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు .. 
మద్యం దుకాణాల వద్ద గస్తీ ముమ్మరం చేయాలని చెప్పారు ...
ఎక్కువగా తాగే కుర్రాళ్ళను గుర్తించి అవసరమైతే 
వాళ్ళ బండ్లు వెనక భటులను పంపించే 
ఏర్పాట్లు చేయాలన్నారు...రాత్రి 12 దాటిన 
తర్వాత భటులకు పనిభారం పెరుగుతుందని 
అయినా అలసట చెందకుండా 
బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు... 
ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడి 
జాబితా సిద్దం  చేయాలన్నారు...
ఎంతమందిని తీసుకువచ్చినా ఇబ్బంది లేదని 
యమలోకంలో రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు చేసామని చెప్పారు...
కుర్రాళ్ళు ఎక్కువుగా వుండే అవకాశం వున్నందున 
వారి కోసం ఇంటెర్నెట్ సదుపాయం కల్పించామని చెప్పారు...
రావడానికి మారం చేసే వాళ్ళపై 
కఠినంగా వ్యవహరించాలన్నారు.. 
గత యేడాది మందు ఎక్కువై కాలవల్లో 
పడిపోయిన వారిని కూడా భటులు పొరపాటున 
తెచ్చి తొక్కిసలాటకు కారణం అయ్యారని గుర్తు చేసారు..
ఈసారి అలాంటి తప్పిదం జరగకుండా చూడాలని అన్నారు...
కొంత మంది అమ్మ కావాలి నాన్న కావాలి 
చెల్లిని అక్కని చూడాలి అని ఇబ్బంది పెడతారని 
వాళ్ళ మాటలు నమ్మవద్దని అన్నారు..
వాళ్లకి నిజంగానే ప్రేమ వుంటే అంతలా తాగి  
బండి నడపరని ఈ విషయాన్ని భటులు గుర్తించాలన్నారు...
లక్కీ డ్రాప్ అంటూ వాళ్ళు తాగే చివరి 
మందు చుక్కలు వాళ్ళ అమ్మ నాన్న కన్నీటి చుక్కలని 
ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పొద్దని అన్నారు...
ఒక్క రాత్రి వారి ఆనందం అయినవారికి 
ఎన్నో రాత్రుల విషాదమనే విషయాన్ని 
ఎట్టి పరిస్థితుల్లో వారికి తెలియనివ్వద్దని  
యముడు ఆదేశించారు.. ఈ సమీక్షలో 
చిత్రగుప్తుడు, యమలోక ఉన్నతాధికారులు, 
సీనియర్ పాపులు పాల్గొన్నారు.
 
- ఓ చెవాకు మాటకారి

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు