వరల్డ్ కిక్‌బాక్సింగ్ పోటీలు.. భారత్‌కు పసిడి.. జమ్మూకాశ్మీర్ చిట్టితల్లి తజ్ముల్ అదుర్స్

శనివారం, 12 నవంబరు 2016 (17:10 IST)
ప్రపంచ కిక్‌బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలిసారిగా స్వర్ణపతకం లభించింది. ఇటలీలోని ఆండ్రియాలో జరిగిన ప్రపంచ కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో జమ్మూకాశ్మీర్‌కు చెందిన ఎనిమిదేళ్ల చిట్టి తల్లి తజ్ముల్ ఇస్లామ్ పసిడి సాధించింది. భారత్ తరపున ఆడిన తజ్ముల్‌ ఫైనల్ పోరులో యూఎస్‌ఏకి చెందిన తన ప్రత్యర్థిని మట్టికరిపించి విజేతగా నిలిచింది. 
 
ఈ సందర్భంగా తజ్ముల్ కోచ్ ఫజిల్ అలీ దర్ మాట్లాడుతూ.. బందిపొరా జిల్లాలోని సైనిక పాఠశాలలో తజ్ముల్‌ మూడో తరగతి చదువుతోందన్నాడు. ప్రపంచ కిక్ బాక్సింగ్ సబ్ జూనియర్ విభాగంలో తజ్ముల్ మెరుగైన ఆటతీరును ప్రదర్శించిందని కితాబిచ్చాడు. 
 
అంతేగాకుండా తజ్ముల్ దేశానికి స్వర్ణ పతకాన్ని కూడా సాధించిపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. గత ఏడాది ఢిల్లీలో జరిగిన జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లోనూ తజ్ముల్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. కాగా ఇటలీలో 6 నుంచి 10వ తేదీ వరకు జరిగిన ప్రపంచ కిక్ బాక్సింగ్ పోటీల్లో 90 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి