ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ కోసం జరిగిన వేలం పాటలో తనను ఫ్రాంచైజీలు కొనుగోలు చేయకపోవడం దురదృష్టకరమని వెస్టిండీస్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఓపెనర్ క్రిస్ గేల్ నిరుత్సాహాన్ని వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ వేలంలో పరిస్థితులు అనుకూలించకపోవడం దురదృష్టకరమని, ఇది తనను ఎంతో నిరాశపరిచిందన్నాడు. మైదానంలో తన శక్తి సామర్థ్యాలేమిటో ఐపీఎల్‌లోని అన్ని ఫ్రాంచైజీలకు బాగా తెలుసు. కనుక కొత్తగా రుజువుచేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదన్నాడు.
కాగా, గత రెండు ఐపీఎల్ సీజన్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఆడిన స్టార్ బ్యాట్స్‌మన్ గేల్‌వైపు ఈసారి వేలంలో పాల్గొన్న పది ఫ్రాంఛైజ్‌లలో ఏ ఒక్కరూ కన్నెత్తి చూడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలను గమనంలో ఉంచుకునే ఈసారి వేలంలో ఐపిఎల్ ఫ్రాంఛైజ్‌లు తనను విస్మరించాయని భావిస్తున్నట్టు గేల్ చెప్పాడు.
వచ్చే ఏప్రిల్ 8వ తేదీ నుండి మే 22వ తేదీ వరకు జరిగే ఐపిఎల్ నాలుగో ఎడిషన్‌కు గేల్ కేవలం రెండు వారాలు మాత్రమే అందుబాటులో ఉంటాడు. దీనిని దృష్టిలో ఉంచుకునే అతడిని కొనుగోలు చేసేందుకు ఈసారి ఏ ఫ్రాంఛైజ్ ముందుకు రాలేదని తెలుస్తోంది.