పరకాల ఓటర్లు 'కొండా' వెనకాల నిలబడేనా?

సోమవారం, 26 నవంబరు 2018 (15:26 IST)
కొండా సురేఖ... తెలంగాణ ఫైర్‌బ్రాండ్. మాజీ మంత్రి. బీసీ సామాజిక వర్గంలో బలమైన మహిళగా ముద్రవేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈమె కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి కారెక్కారు. ఈమెకు సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో చోటుదక్కుతుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఆమెకు కేసీఆర్ మొండిచేయి చూపారు. ఆమెకు ఒక్కరికే కాదు తెరాస తరపున విజయం సాధించిన మహిళా ఎమ్మెల్యేలందరినీ ఆయన చీపురుపుల్లలా తీసిపారేశారు. ఫలితంగా కొండా సురేఖ నాలుగున్నరేళ్ళపాటు ఇంటికే పరిమితమయ్యారు. 
 
ఈ క్రమంలో నాలుగున్నరేళ్లు గడిచిపోయాయి. రాష్ట్ర అసెంబ్లీని సీఎం కేసీఆర్ రద్దు చేసిన ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఇందుకోసం తొలి జాబితాను వెల్లడించారు. ఈ జాబితాలో కొండా సురేఖ పేరు లేదు. దీంతో ఆమె ఆగ్రహించి తిరిగి కాంగ్రెస్ గూటికే చేరారు. ఇక్కడ ఆమెకు మళ్లీ పరకాల అసెంబ్లీ స్థానం టిక్కెట్‌ను కేటాయించింది. అదేసమయంలో తెరాస తరపున గత ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి.. ఆ తర్వాత కారెక్కారు. ఇపుడు గులాబీ టిక్కెట్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీజేపీ తరపున పి.విజయచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో పరకాల అసెంబ్లీ ఎన్నిక ఇపుడు రసవత్తరంగా మారింది. ఫలితంగా పరకాల ఓటర్లు కొండా సురేఖ వెనకాల నిలబడతారా? లేదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 
 
వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోకి పరకాల అసెంబ్లీ స్థానం వస్తుంది. మొత్తం 1,98,297 మంది ఓటర్లు కలిగిన పరకాల సెగ్మెంట్‌లో అగ్రవర్ణాలకు చెందిన ఓటర్లు 16,400 మంది ఉన్నారు. అలాగే, బీసీలు 85,169 మంది ఓటర్లు ఉండగా, ఎస్సీలు 30,939 మంది ఓటర్లు, ఎస్టీలు 7,754 మంది ఓటర్లు, ముస్లింలు 3200 మంది, ఇతరులు 54,835 మంది ఓటర్లు ఉన్నారు. 
 
గత ఎన్నికల్లో మొత్తం 1,63,855 ఓట్లు పోలుకాగా, వీటిలో టీడీపీ తరపున బరిలోకి దిగిన చల్లా ధర్మారెడ్డికి 67,432 ఓట్లు వచ్చాయి. తెరాస అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎం. సహోదర్ రెడ్డికి 58,324, కాంగ్రెస్ తరపున పోటీ చేసిన వెంకట్రాంరెడ్డికి 30,283 ఓట్లు పోలయ్యాయి. కానీ, ఇపుడు మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం కాంగ్రెస్ అభ్యర్థిగా పరకాల సురేఖ బరిలో ఉండటమే. 
 
ఈ సెగ్మెంట్‌లో కొండా సురేఖ అనుకూలతలు పరిశీలిస్తే.. బీసీ సామాజికవర్గంలో బలమైన మహిళా నేతగా ఉండటం, పరకాలతో 15 యేళ్ళ అనుబంధం, కాంగ్రెస్ పార్టీలోని మహిళా నేతల్లో సీనియర్, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటం. ఇలాగే, ప్రతికూలతలను పరిశీలిస్తే, గత ఐదేళ్ళుగా నియోజకవర్గానికి దూరంగా ఉండటం, కార్యకర్తలు చెల్లాచెదురుకావడం, ఎన్నికల సమయంలో పార్టీ మారడం ఆమెకు కొంత ఇబ్బందిగా ఉంది. 
 
అలాగే, తెరాస అభ్యర్థిగా బరిలోకి దిగిన ధర్మారెడ్డికి గల అనుకూలతలను పరిశీలిస్తే, గత నాలుగున్నరేళ్లలో మిషన్ భగీరథ ద్వారా 120 గ్రామాలకు నీరు అందించడం, రూ.1500 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, రూ.1200 కోట్లతో మెగా టెక్స్‌టైల్ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం, పరకాలవాసుల చిరకాల కోరిక అయిన రెవెన్యూ డివిజన్‌ను సాధించడం. అలాగే, పార్టీ సీనియర్లను పక్కనపెట్టడం, కాంట్రాక్టులన్నీ తానొక్కడే పొందారన్న ఆరోపణలు ఆయనకు ప్రతికూలంగా మారాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు