గణపతి విగ్రహాలపై కరోనా తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. కరోనా భయంతో విగ్రహాలు అమ్ముడు పోతాయో లేదోనని చాలా చోట్ల విగ్రహాల తయారీ నిలిచిపోయింది. గణేశ్ ఉత్సవాలకు అనుమతి ఉంటుందో లేదోనన్న సందేహం నెలకొంటున్నది. పరిస్థితి ఇలా కొనసాగితే ఏడాది పాటు తాము కష్టాలు పడక తప్పవని కళాకారులు వాపోతున్నారు. వీటిపై ఆధారపడి జీవనం కొనసాగించే కళాకారుల జీవన విధానం అగమ్యగోచరంగా మారింది.
బోనాల పండుగ తర్వాత అత్యంత వైభవంగా జరుపుకునేది వినాయక చవితి. దీంతో గణనాధుడు పది, పదకొండు రోజులు వీధివీధిన పూజలందుకుంటాడు. భక్తులు విభిన్న ఆకృతులలో విగ్రహాలను తయారు చేస్తుంటారు. ఇందుకోసం మూడు నెలల ముందే ఆర్డర్లు ఇచ్చి తయారు చేసుకుంటారు.