ఆ గ్యాంగ్ రేప్ అంతా కట్టుకథే.. తేల్చిన భాగ్యనగరి పోలీసులు

గురువారం, 19 ఆగస్టు 2021 (10:58 IST)
హైదరాబాద్, సంతోష్‌ నగర్‌ యువతి గ్యాంగ్ రేప్‌ కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. యువతిపై అత్యాచారం జరగలేదని, తనను కాదని మరో వివాహం చేసుకుంటున్న బాయ్‌ఫ్రెండ్‌ని కేసులో ఇరికించేందుకు నాటకం ఆడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫిసల్‌బండకు చెందిన ఓ యువతి సంతోష్‌నగర్‌లో లాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ఈ నెల 17వ తేదీన రాత్రి 9.30 గంటలకు బదులు 10.30 గంటలకు యువతి ఇంటికి వెళ్లింది. 
 
గంట ఆలస్యంగా రావడంతో కుమార్తెను తల్లిదండ్రులను ప్రశ్నించడంతో తనపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం చేశాడని యువతి తల్లిదండ్రులకు బోరున విలపిస్తూ చెప్పింది. ఆ తర్వాత వారంతా కలిసి బుధవారం సంతోష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో ఎలాంటి ఆధారం లభించలేదు. యాదగిరి థియేటర్‌ నుంచి పహాడీషరీఫ్‌ వరకు రోడ్లపై ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా.. అందులో చిన్న క్లూ కూడా చిక్కలేదు.
 
బాధితురాలి ఫిర్యాదుకు, సీన్ ఆఫ్ అఫెన్స్‌కు ఎక్కడా పొంతన కుదరకపోవడం.. యువతి ఇంటి నుంచి డయాగ్నోస్టిక్ సెంటర్ రెండు కిలోమీటర్లు కూడా లేకపోవడంలో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. 
 
అయినా దర్యాప్తులో ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా విచారణ కొనసాగించారు. బాధితురాలు ఆటో ఎక్కిన ప్రాంతం నుంచి ప్రధాన రహదారి, అనుసంధాన రహదారులు, నిర్మానుష్య ప్రాంతాలకు దారితీసే చోట్ల సీసీ కెమెరాలను పరిశీలించారు.
 
వాటిల్లో కనిపించిన ఆటోలు ఏ మార్గం నుంచి వెళ్లాయో ఆరా తీశారు. సంతోష్‌నగర్‌ నుంచి మైలార్‌దేవ్‌పల్లి, పహాడీషరీఫ్‌ ప్రాంతాల్లో సెల్‌ టవర్‌ సిగ్నల్స్‌ను విశ్లేషించారు. చాలా మంది ఆటో డ్రైవర్లనూ విచారించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు యువతిని పలు కోణాల్లో విచారించారు. 
 
అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాను ప్రేమించిన వ్యక్తికి మరో యువతితో వివాహం నిశ్చయం చేసుకున్నాడని, ఆ కక్షతోనే అతడిని కేసులో ఇరికించేందుకు నాటకమాడినట్లు అసలు విషయాన్ని బయటపెట్టింది. మరో వైపు వైద్య పరీక్షల్లో యువతిపై అత్యాచారం జరుగలేదని తేలిందని సమాచారం. దీంతో యువతిని తీవ్రంగా మందలించిన పోలీసులు మరోమారు ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చిరంచారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు