మత్తు ట్యాబ్లెట్లను భోజనం కలిపి భర్తకు వడ్డించిన భార్య...

సోమవారం, 4 అక్టోబరు 2021 (21:30 IST)
తాను సాగిస్తున్న రంకుబాగోతానికి కట్టుకున్న భర్త అడ్డు వస్తున్నాడన్న అక్కసుతో ఓ భార్య దారుణానికి పాల్పడింది. మత్తు మాత్రలు కలిపిన భోజనం భర్తకు వడ్డించింది. విషయం తెలియని భర్త.. ఆ భోజనం ఆరగించగానే అపస్మారకస్థితిలోకి జారుకున్నాడు. ఆ తర్వాత తన ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి హత్య చేసింది. ఈ దారుణం జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గద్వాల జిల్లాలోని అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన రాజు అతని భార్య మాధవి గద్వాల మండలం తూర్పుపల్లి గ్రామంలో బత్తాయి తోటలో పని చేస్తున్నారు.
 
అయితే, మాధవికి మక్తల్ మండలం కలవల దొడ్డి గ్రామానికి చెందిన మునేష్‌ అనే వ్యక్తితో పెండ్లికి ముందు నుంచే పరిచయం ఉంది. దీంతో అతనితో ఉన్న వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఈ విషయం తెలిసిన భర్త.. భార్యతో తరచూ గొడవలు పడుతూ వచ్చేది. దీంతో భర్తను ఎలాగైనా చంపాలన్న నిర్ణయానికి వచ్చింది. 
 
ఈ విషయం తన ప్రియుడు మునేష్‌కు తెలియజేసి ఈ నెల 2న హత్యకు ప్లాన్ వేసింది. ఆ రోజు రాత్రి భార్య మాధవి రాజుకు అన్నంలో మత్తు ట్యాబ్లెట్లు కలిపి భోజనం వడ్డించింది. రాజు మత్తులోకి జారుకోగానే అప్పటికే అక్కడికి చేరుకున్న ప్రియుడితో పాటు అతని మిత్రులు కుంటి జైపాల్, బోయ రవి, రవీంద్ర గొంతుకు తాడు బిగించి ఊపిరాడకుండాచేసి హత్య చేశారు.
 
హత్యను ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించి రాజు శవాన్ని పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గర పడేసి వెళ్లారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మాధవిని అదుపులోకి తీసుకొని విచారించగా భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించినట్లు ఏసీపీ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు