అయితే, ఇప్పుడు జరగబోతున్న తెలంగాణా ముందస్తు ఎన్నికలకు మాత్రం ఆంధ్ర పోలీసుల సాయం తమకు అక్కర్లేదని తెలంగాణా స్పష్టం చేసేసింది. ఇది కూడా ఎవరో రాజకీయ నాయకుడు చెప్తే ఏమై ఉండేదో కానీ, ఇలా చెప్పింది మాత్రం స్వయంగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్. అయితే దీని వెనుక చాలా కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది..
కొన్ని రోజుల కిందట జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు ప్రత్యక్షమై కొందరికి డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ తెలంగాణా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతోపాటు ఈ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి చేరవేశారు. ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన ఈసీ.. తెలంగాణలో ఏపీ నిఘా వర్గాల సంచారం ఓటర్లను ప్రలోభ పెట్టడంపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీ డీజీపీని ఆదేశించింది.