తెలంగాణలో బస్సుల పరుగులు..కొన్ని కండీషన్లు

మంగళవారం, 19 మే 2020 (20:54 IST)
తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన వెసులుబాట్లను అనుసరించి... తెలంగాణలో ఇవాళ బస్సులు తిరిగి ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ తప్ప జిల్లాల్లో బస్సులు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యాయి.

కరోనా వల్ల 56 రోజులుగా ఆగిపోయిన బస్సులు... ఇప్పుడు తిరిగి పరుగులు పెడుతున్నాయి. ఐతే... ప్రభుత్వం కొన్ని కండీషన్లు పెట్టింది. వాటిని ప్రజలంతా తప్పనిసరిగా పాటించాలని చెప్పింది. లేదంటే మళ్లీ కరోనా కేసులు పెరిగితే... మళ్లీ పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. మరి ఆ కండీషన్లేంటో..? 
 
 
తెలంగాణ జిల్లాల్లో ఆర్టీసీ బస్సులకు కొత్త కండీషన్లు :
- మే 31 వరకూ జిల్లాల్లో మాత్రమే బస్సులు నడుస్తాయి. హైదరాబాద్‌లో సిటీ బస్సులకు అనుమతి లేదు.
- హైదరాబాద్‌లో ఆటోలు, టాక్సీలకు అనుమతి ఇచ్చారు. టాక్సీల్లో డ్రైవర్‌తో కలిపి నలుగురు, ఆటోలో డ్రైవర్‌తో కలిపి ముగ్గురు ప్రయాణించవచ్చు.
- హైదరాబాద్ సరిహద్దుల వరకే బస్సుల్ని నడుపుతారు.
- ఎంజీబీఎస్ కి బస్సులు రావు. జేబీఎస్ కి మాత్రం వస్తాయి.
- ఆర్టీసీ బస్సులన్నీ రాత్రి 7 కల్లా డిపోలకు చేరాల్సి ఉంటుంది.
- ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే.
- ప్రయాణికులు వెంట శానిటైజర్ తప్పక తెచ్చుకోవాలి.
- శానిటైజర్ లేని ప్రయాణికులకు బస్టాండ్ల దగ్గర శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్నారు.
- సోషల్ డిస్టాన్సింగ్ అమలయ్యేలా బస్సుల్లో తగిన ఏర్పాట్లు చేశారు.
- ప్రస్తుతానికి టికెట్ల పెంపు లేదని ప్రభుత్వం తెలిపింది.
- ఇకపై బస్సుల్లో నిల్చొని ప్రయాణించడం అన్నది ఉండదు.
- అన్ని సీట్లలోనూ ప్రయాణికుల్ని కూర్చోనిస్తారు. సీట్ల మధ్య గ్యాప్ ఏమీ లేదు.
- తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సులు వెళ్లవు.
- నల్గొండ వైపు నుంచి వచ్చే బస్సుల్ని ఎల్బీనగర్ దగ్గర ఆపేస్తారు.
- మహబూబ్‌నగర్ నుంచి వచ్చే బస్సుల్ని ఆరాంఘర్ దగ్గర ఆపేస్తారు.
- వరంగల్ నుంచి వచ్చే బస్సుల్ని ఉప్పల్ దగ్గర ఆపుతారు.
- నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి వచ్చే బస్సుల్ని జేబీఎస్ దగ్గర ఆపుతారు.
- ఆర్టీసీ యాజమాన్యం... ఇవాళ్టి నుంచి నడిపే ప్రతీ బస్సును ముందుగానే శానిటైజ్ చేస్తుంది.
- డ్రైవర్లు, కండక్టర్లకు మాస్కులు, శానిటైజర్లను ఇచ్చింది.
- ఆర్టీసీ కార్మికులకు డిపోలోకి ఎంటరయ్యేటప్పుడే థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు.
- హైదరాబాద్‌లో బస్సులు తిరిగేందుకు జూన్ నుంచి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
- ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాలు తిరిగేందుకు అనుమతి ఉంది.
 
కొత్త రూల్స్ ప్రకారం తెలంగాణలో మొత్తం 10460 బస్సుల్లో 6082 బస్సులు ఇప్పుడు తిరిగి రోడ్డెక్కుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బస్సులో సీట్ల మధ్య గ్యాప్ ఉండాలని చెప్పింది. ఐతే... దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఫైనల్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

తెలంగాణలో సీట్ల మధ్య గ్యాప్ ఉండాలంటే... టికెట్ల రేట్లను 33 శాతం పెంచాల్సి వస్తుందని అధికారులు చెప్పడంతో... మొత్తం సీట్లలో ప్రయాణికుల్ని కూర్చోనివ్వాలని కేబినెట్‌లో ఫైనల్ నిర్ణయం తీసుకున్నారు.

ఇది ఒక రకంగా సోషల్ డిస్టాన్సింగ్‌కి విరుద్ధమైన నిర్ణయమే అయినప్పటికీ ప్రజలపై ఛార్జీల భారం పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్ని అనుమతించాలని ఎప్పటి నుంచో ప్రజలు కోరుతున్నారు. మొత్తానికి ఇప్పటికీ సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఇప్పుడు జాగ్రత్తగా ప్రయాణించాల్సిన బాధ్యత ప్రజలదేననీ, తగిన జాగ్రత్తలు పాటిస్తూ... అందరూ క్షేమంగా ఉండేలా అందరూ ప్రయత్నించాలని ప్రభుత్వం కోరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు