రాజా సింగ్ అరెస్ట్.. నాంపల్లి కోర్టు వెలుపల హైటెన్షన్..
మంగళవారం, 23 ఆగస్టు 2022 (18:24 IST)
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆయనను అరెస్ట్ చేయటమే కాకుండా.. ఏకంగా పార్టీ అధిస్టానం పార్టీనుంచి సస్పెండ్ చేసే వరకు వెళ్లింది. రాజాసింగ్ అరెస్ట్ పాతబస్తీలో హై టెన్షన్ నెలకొంది.
హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు వెలుపల సస్పెండ్ చేయబడిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మద్దతుదారులతో పాటు ఆయనకు వ్యతిరేకంగా నిరసనకు దిగిన నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు.
అంతకుముందు మహ్మద్ ప్రవక్తపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై సస్పెండ్ అయిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పోలీసులు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు హాజరుపరిచారు.
మరోవైపు అరెస్ట్ చేసినా రాజాసింగ్ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని.. ధర్మం కోసం చావటానికైనా సిద్ధంగా ఉన్నానంటూ మరోసారి స్పష్టం చేశారు. ఓ వర్గం మనోభావాలు కించపరిచారంటూ పాతబస్తీలో ఆవర్గానికి చెందిన నేతలు ఆందోళనలకు దిగారు.
రాజాసింగ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఆందోళనలు పెరుగుతున్న క్రమంలో పోలీసులు.. యూట్యూబ్‌ను రాజాసింగ్ వీడియో తొలగించాలని కోరారు. పోలీసుల అభ్యర్థన మేరకు యూ ట్యూబ్ వివాదాస్పద వీడియోను తొలగించింది.