మాఫియా అడ్డాగా ప్రగతి భవన్ : బండి సంజయ్

సోమవారం, 18 జనవరి 2021 (15:56 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్ మాఫియాకు అడ్డాగా మారిపోయిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా, రాష్ట్రంలో భూమాఫియా, ఇసుక, డ్రగ్‌, లిక్కర్‌.. ఇలా అన్ని మాఫియాలకు ప్రగతి భవన్‌ అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. 
 
సికింద్రాబాద్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంజయ్‌ అధ్యక్ష హోదాలో తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'హైదరాబాద్‌లో దేవాలయ భూములను మజ్లిస్‌ నేతలు కబ్జా చేస్తే.. ప్రభుత్వ, ప్రైవేటు భూములను టీఆర్‌ఎస్‌ నాయకులు స్వాహా చేస్తున్నారు' అని ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన సీఎం, వాటి విఘాతానికి కారణమవుతున్న పార్టీలను పెంచిపోషిస్తున్నారని మండిపడ్డారు. 
 
'కేసీఆర్‌ ప్రభుత్వం కరోనా కేసులను తక్కువ చూపించింది. మృతదేహాల విషయంలో కూడా గందరగోళమే. కరోనా బారినపడ్డ మైనారిటీలకు కాజూ, కిస్మిస్‌, బాదాంలు ఇచ్చిన ప్రభుత్వం.. పేద హిందువులు గాంధీ ఆస్పత్రిలో చేరితే వారికి కనీస వైద్యం అందించలేదు. దీంతో ఎంతోమంది చనిపోయారు. ప్రధాని మోదీ వచ్చే వరకు కేసీఆర్‌కు భారత్‌ బయోటెక్‌ గురించి అవగాహన లేదు. టీకా ప్రారంభం సందర్భంగా అది తమ ఘనకార్యంగా టీఆర్‌ఎస్‌ ప్రచారం చేసుకుంది. ఒక్క చోట కూడా ప్రధాని ఫొటో పెట్టలేదు' అని సంజయ్ వివరించారు. 
 
కరోనా నియంత్రణకు పారాసిటమాల్‌ వేసుకుంటే సరిపోతుందని, ఆయుష్మాన్‌ భారత్‌ గొప్పదా? అంటూ చులకన చేసి మాట్లాడిన కేసీఆర్‌ తర్వాత వాటిపై యూటర్న్‌ తీసుకున్నారని గుర్తుచేశారు. మజ్లిస్‌తో కలిసి హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రాన్ని లూటీ చేస్తోందని, దీనిపై ప్రజలు ఆక్రోషంగా ఉన్నారన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు