తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా వైఎస్‌ఆర్‌టిపిని స్థాపించిన వైఎస్ షర్మిలకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇటీవలే పార్టీని ప్రకటించి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ.. పార్టీలోని కీలక నాయకుడొకరు గుడ్‌బై చెప్పారు. ఆ పార్టీకి చెందిన నేత రాఘవ రెడ్డి వ్యవహారశైలికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు చేవెళ్ల ప్రతాప్‌రెడ్డి ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని పార్టీ కార్యాలయానికి పంపారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వైఎస్‌ఆర్‌టిపి ఇన్‌చార్జ్‌గా ప్రతాప్‌రెడ్డి ఉన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలో పార్టీ నిర్మాణాలను పటిష్టం చేసుకునేందుకు షర్మిల కసరత్తు ప్రారంభించారు. ఇలాంటి సమయంలో పార్టీకి చేవెళ్ల ప్రతాప్‌రెడ్డి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. పార్టీ స్థాపించిన కొంత కాలానికే ఆధిపత్య పోరు మొదలైందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.