నామినేషన్‌కు కొన్ని గంటల ముందు ప్రకాష్ రాజ్‌పై కేసు నమోదు

శుక్రవారం, 22 మార్చి 2019 (11:50 IST)
కర్ణాటక ఎన్నికల సంఘం అధికారులు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌పై కేసు నమోదు చేసారు. బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నప్రకాష్ రాజ్.. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంతో ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది.


మరి కొద్ది గంటల్లో బెంగళూరు సెంట్రల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్దపడుతున్న ప్రకాష్ రాజ్‌పై... ఈ కేసు నమోదు కావడం ఇక్కడ గమనార్హం. మార్చి 12వ తేదీన మహాత్మాగాంధీ రోడ్డులో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ప్రసంగించిన ప్రకాష్ రాజ్, అందులో రాజకీయాలకు సంబంధించిన వ్యాఖ్యలు చేయడమే దీనికి కారణమని తెలుస్తోంది.
 
నిజానికి ఆ కార్యక్రమం మీడియా, భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించినది కాగా... ఆ వేదికపై ప్రకాష్ రాజ్ పొలిటికల్ వ్యాఖ్యలు చేసారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.కార్యక్రమంలోని ప్రకాష్ రాజ్ ప్రసంగాన్ని సెల్‌ఫోన్లలో చిత్రీకరించిన కొంతమంది ఆహ్వానితులు.. దానిని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు షేర్ చేయడంతో మూర్తి అనే ఓ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి వెంటనే తన టీమ్‌తో కలిసి అక్కడికి వచ్చారు.

అప్పటికే కార్యక్రమం పూర్తయిపోయి అందరూ వెళ్లిపోవడం జరిగింది. దీంతో ఆ వీడియో ఆధారంగా సదరు అధికారి కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ప్రకాష్ రాజ్‌‌పై ఫిర్యాదు చేయగా... పోలీసులు కేసు నమోదు చేసారు. ప్రకాష్‌రాజ్‌తో పాటు కార్యక్రమ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేయబడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు