క్యాన్సర్‌తో పోరాడి ఓడిన అలనాటి మేటి బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా అప్పట్లో సూపర్‌స్టార్ అమితాబ్‌తో పోటాపోటీగా హిట్లు కొట్టి, ఎంతో మంది అభిమానాన్ని పొందాడు. అలాగే కొనసాగి ఉంటే ఆయన ఏ రేంజిలో సక్సెస్ అయ్యేవాడో కానీ, ఓషో రజనీష్ పట్ల ఆకర్షితుడై సినిమాలకు గుడ్‌బై చెప్పేసాడు.
వివాదాస్పద నినాదంతో శృంగార లీలలకు ఆలవాలమైన రజనీష్ ఆశ్రమానికే పూర్తిగా అంకితమైపోయిన వినోద్ ఖన్నా అక్కడే విలాసజీవితాన్ని గడుపుతూ కుటుంబానికి సైతం దూరమయ్యారు. ఆ ఆశ్రమంలో ఆయన్ని సెక్సీ స్వామీజీ, స్వామి వినోద్ భారతి వంటి పేర్లతో పిలిచేవారు. పోలీసులు, ప్రభుత్వం ఒత్తిళ్లతో భారతదేశం నుండి అమెరికాకు మకాం మార్చేసిన రజనీష్‌తో పాటు వెళ్లిపోయిన వినోద్ ఖన్నా అక్కడే అతని సేవలు చేసుకుంటూ కాలం గడిపేసాడు. రజనీష్ బట్టలు ఉతికానని, చెట్లకు నీరు పోసేవాడినని స్వయంగా వినోద్ ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పాడు.
ఎన్నో కలలతో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి, ఎంతో డబ్బు, సెలబ్రిటీ హోదాను సంపాదించుకుని, రజనీష్ మాయతో కొన్నేళ్లు వ్యర్థంగా గడిపి, చివరికి క్యాన్సర్‌తో చేసిన పోరాటంలో ఓడి తుదిశ్వాస విడిచారు వినోద్ ఖన్నా అలియాస్ సెక్సీ స్వామీజీ అలియాస్ స్వామి వినోద్ భారతి.