మాజీ యాంకర్ తేజస్విని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తేజస్విని ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు జరుపుతున్నారు. వివరాల్లోకి వెళ్తే, విజయవాడ శివార్లలో ఉన్న ఈడుపుగల్లు ఎంబీఎంఆర్ కాలనీలో గత కొంతకాలంగా తేజస్విని, ఆమె భర్త పవన్ కుమార్ ఉంటున్నారు.
తేజస్విని గతంలో ఓ ఛానల్‌లో యాంకర్‌గా పని చేసింది. పవన్ కుమార్ ఉయ్యూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే అత్త అన్నపూర్ణాదేవితో తేజస్విని గొడవపడింది. ఆపై గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతకూ తేజస్విని రాకపోవడంతో... అనుమానం వచ్చిన అత్త గదిలోకి వెళ్లి, చూసింది. ఫ్యాన్‌కు వేలాడుతూ తేజస్విని కనిపించడంతో... వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదిలావుండగా యాంకర్ తేజస్విని రాసిన సూసైడ్ నోట్ దొరికింది. తేజస్విని ఆత్మహత్య కేసులో ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. "పవన్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నమ్మి వచ్చినందుకు నన్ను వేధించాడు. ఇబ్బందులు పెడుతున్నాడు. నాకన్నా స్నేహితులే అతనికి ఎక్కువయ్యారు. నన్ను పట్టించుకోవడం లేదు. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నా" అంటూ సూసైడ్ నోట్‌లో తేజస్విని పేర్కొంది.
వరకట్న వేధింపులు భరించలేకే ఆత్మహత్యకు పాల్పడినట్టు సూసైడ్ నోట్‌లో ఉండటంతో సెక్షన్ 498ను, ఆత్మహత్యకు పాల్పడినందుకు సెక్షన్ 306ను పోలీసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అయితే, సూసైడ్ నోట్ ముందే లభ్యమైనా పోలీసులు తొలుత ఈ సెక్షన్ల కింద ఎందుకు కేసులు నమోదు చేయలేదని తేజస్విని బంధువులు ప్రశ్నిస్తున్నారు.