ఇంకా చిరు మాట్లాడుతూ, `నువ్వు కాస్త డల్‌గా ఉన్నావనిపించింది. అందుకనే నిన్ను ఇక్కడకు తీసుకొస్తే బావుంటుందనిపించిదని రాఘవేంద్రరావుగారు అన్నప్పుడు నాలో తెలియని ఓ జోష్ వచ్చింది. ఆ జోష్ తగ్గలేదు. పాతికేళ్ల తర్వాత మరోసారి ఆయన నన్ను ఈ పెళ్లి సందడి సినిమాకు ఆహ్వానించి అదే ప్రేమానురాగాలు, ఆప్యాయతను చూపించారు. అభిమానులందరి రుణం తీర్చుకోలేనిది. రాఘవేంద్రరావుగారితో నా అనుబంధం చెప్పలేనిది. అప్పట్లో ఆయన దర్శకత్వంలో సినిమా చేస్తే కానీ, ఓ సుస్థిరస్థానం ఉండదు అనుకునేవాళ్లం. ఆయనతో సినిమాలు చేసేవాళ్లం. అది ఆయన మాకు ఇచ్చిన భరోసా. కెరీర్ స్టార్టింగ్‌లో మోసగాడు అనే సినిమాలో చిన్న పాత్ర చేశాను. కానీ, పూర్తిస్థాయి పాత్ర కావాలని అనుకున్నాను. అప్పుడు 1995లో అడవిదొంగ సినిమా చేశాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఎలాంటి కలెక్షన్స్ వచ్చాయో అందరికీ తెలిసిందే.
నా చిరకాల మిత్రుడు విక్టరీ వెంకటేశ్ ఈ వేడుకకి రావడం ఎంతో ఆనందంగా ఉంది. హీరోలందరి మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే ఇండస్ట్రీలో ఇలా కొట్టుకోవడాలు, మాటలనటం, మాటలనిపించుకోవడం ఉండదు కదా. పదవులు ఏదైనా తాత్కాలికమే. వాటి కోసం మాటలు అనడం, అనిపించుకోవడం.. చూస్తుంటే బాధనిపిస్తుంది. అదెవరైనా కానీ. నేను ఏ ఒక్కరినీ వేలు పెట్టి చూపించాలనుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఉండండి. మన ఆదిపత్యం చూపించుకోవడానికి, ప్రభావాన్ని చూపించుకోవడానికి ఎదుటి వారిని కించపరచాల్సిన అవసరం లేదు. సమస్యను ఎక్కడ స్టార్ట్ అయ్యింది. వివాదాలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయో తెలుసుకుని హోమియోపతి వైద్యంలా మూలాల్లోకి వెళ్లి ట్రీట్‌మెంట్ ఇవ్వాలి. అలాంటి వ్యక్తులను దూరంగా ఉంచితే అందరూ బావుంటారు. అప్పుడది వసుధైక కుటుంబం అవుతుంది. ఈ పెళ్లి సందD నాటి పెళ్లి సందడిలా గొప్పగా ఆడాలని, ఆడుతుందని భావిస్తున్నాను అన్నారు.