టాలీవుడ్‌లో చాలా మంది మెదడులేని దర్శకులున్నారంటూ ట్విట్టర్లో కీరవాణి చేసిన వ్యాఖ్యలు ఒక రేంజిలో నెటిజన్లను మండించాయి. కీరవాణి తన సుదీర్ఘ సంగీత దర్శకత్వం కెరీర్‌లో అన్ని మాటలు ఎప్పడూ అనిపించుకుని ఉండడు. కెరీర్ వద్దనుకుంటున్నట్లు ప్రకటిస్తూనే ఇంకా కొనసాగుతున్న వారిని బుర్రతక్కువ వాళ్లంటూ కీరవాణి వ్యాఖ్యానించడం ద్వారా తన చేదు అనుభవాలను బయట పెట్టి ఉండవచ్చు కానీ నోరు జారిన ఆ ఒక్కమాట ఆయన్ను సోషల్ మీడియాలో చాలా పలుచన చేసి పడేసింది.
రాజమౌళి ఎంత గొప్ప డైరెక్టర్ అయినా, కీరవాణి ఎంత మంచి సంగీత దర్శకుడైనా మిగతా దర్శకులను బుర్రలేని వారనటం సమంజసమేనా అన్నది నెటిజన్ల ఫీలింగ్. ఆర్థిక ఇబ్బందులకు గురైన కీరవాణి కుటుంబం లాగే ఎందరో దర్శకులు చిన్న, పెద్ద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారున్నారని కుటుంబాలను పోషించుకునేందుకు ప్రయత్నిస్తూనే హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారిని విమర్శించడం సరైంది కాదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
అంతటితో ఆగకుండా మీరు మాత్రం ట్యూన్లను కాపీ కొట్టలేదా? సంగీత దర్శకుల్లో కాపీ కొట్టేవారిలో మీరే ముందుంటారంటూ ఎద్దేవా చేశారు. ఒక నెటిజన్ అయితే మరింత ముందుకెళ్లి బాహుబలి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కాపీ మ్యూజిక్కేనని పేర్కొంటూ ఓ హాలీవుడ్ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వీడియోను కీరవాణి ట్వీట్‌కు రిప్లైగా పోస్ట్ చేశాడు.
పైగా బ్రెయిన్ లెస్ వ్యాఖ్యలపై కీరవాణిని రామ్‌గోపాల్ వర్మతో ముడిపెడుతున్నారు సినీ అభిమానులు. కీరవాణిలాంటి ఓ బ్రెయిన్ లెస్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మను ట్విట్టర్లో ఫాలో అవుతూ.. ఇలాంటి బ్రెయిన్ లెస్ వ్యాఖ్యలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి మీరు వెళ్లిపోతే బాగుంటుందని నెటిజన్లు సూచిస్తున్నారు.
కెరీర్ చరమాంకంలో ఉన్న కీరవాణి అన్నమయ్య సినిమాతో చిత్ర సంగీతానికి అలనాటి దివ్యత్వాన్ని తీసుకొచ్చారు. భక్తి సంగీతాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లిన కీరవాణి దర్శకులపై తనకున్న అసంతృప్తిని ఇలా చివరి దశలో బయటపెట్టి తనకు తాను చెరుపు చేసుకున్నారనిపిస్తోంది. ఎదుటివారిని ఒకమాటంటే తనకూ అదే స్థాయిలో పడతాయని కీరవాణి ఎందుకు గ్రహించలేదని ఆయన అభిమానుల బాధ.