పవన్ కళ్యాణ్ "అజ్ఞాతవాసి"కి ఎదురుదెబ్బ.. ఆ షోలకు బ్రేక్

మంగళవారం, 9 జనవరి 2018 (13:02 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం ఈనెల పదో తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే, ఈ చిత్రం ప్రీమియర్ షోలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. 
 
అర్థరాత్రి తర్వాత ప్రీమియర్ షోలు ప్రదర్శించకూడదంటూ థియేటర్ యజమానులకు ఆదేశాలు జారీచేశారు. పవన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్రీమియర్ షోలకు భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో తొక్కిసలాటలు జరిగే ప్రమాదం ఉందని, అందుకే అర్థరాత్రి తర్వత ప్రీమియర్ షోలకు అనుమతి నిరాకరించామని పోలీసు ఉన్నతాధికారులు వివరణ ఇస్తున్నారు. 
 
'అజ్ఞాతవాసి' ప్రీమియర్ షోల కోసం భ్రమరాంబ, మల్లికార్జున, ఆర్కే థియేటర్లు పోలీసులు అనుమతి కోరిన నేపథ్యంలో భద్రత కారణాల వల్ల పోలీసులు నిరాకరించారు. గతంలో కూడా ప్రీమియర్ షోలు వేసినప్పుడు పలుచోట్ల తొక్కిసలాటలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అభిమానులు సహకరించాలని పోలీసులు కోరారు.
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈ ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చారు. అంటే రోజుకు ఏడు షోలు వేసుకునేలా సీఎం చంద్రబాబు సర్కారు సమ్మతించింది. పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొనివున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు