'ఆదిపురుష్' ఓటీటీ రిలీజ్ తేదీ వెల్లడి

బుధవారం, 28 జూన్ 2023 (12:47 IST)
ప్రభాస్ - కృతి సనన్ జంటగా, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆదిపురుష్'. ఈ నెల 16వ తేదీన విడుదలైన ఈ చిత్రం అనేక విమర్శలను మూటగట్టుకున్నప్పటికీ.. కలెక్షన్లపరంగా భారీగా వసూలు చేస్తుంది. ఇప్పటికే రూ.450 కోట్ల మేరకు వసూలు చేసింది. ఈ చిత్రం ఫలితంతో నిమిత్తం లేకుండా కేవలం ప్రభాస్ క్రేజ్ కారణంగా ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యే తేదీ గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది 'ఆదిపురుష్' ఓటీటీ రిలీజ్‌పై నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. దీనిపై నిర్మాతలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. 
 
దేశ ప్రజలకు బుర్రలేదని అంటారా? 
 
'ఆదిపురుష్' చిత్రంలో రాముడు, లక్ష్మణుడు, సీత, రావణుడు, హనుమంతుడు ఉన్నట్టు చూపించారు. అయినా ఇది రామాయణం కాదని చెబుతారా? అంటే దేశ ప్రజలకు బుర్రలేదని భావిస్తున్నారా? అంటూ ఆ చిత్ర దర్శక నిర్మాతలపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. హిందువులు చాలా క్షమాగుణం కలిగివుంటారని, అలాగని ప్రతిసారీ వారి సహనాన్ని ఎందుకు పరీక్షిస్తారంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. సభ్యత చూపుతూ సహనంతో ఉన్నారు కదాని అణచివేతకు దిగడం సరైనదేనా? అని అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం మంగళవారం ప్రశ్నించింది. 
 
రామాయణ గాథ ఆధారంగా ఇటీవల విడుదలైన వివాదాస్పద చిత్రం 'ఆదిపురుష్‌'లో కీలక పాత్రలను చిత్రీకరించిన తీరుపై కోర్టు విస్మయం వ్యక్తపరిచింది. ఈ చిత్రంపై నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం.. హిందీ సంభాషణల రచయిత మనోజ్‌ ముంతశిర్‌ను ఇంప్లీడ్‌ చేయాలన్న దరఖాస్తును ఆమోదిస్తూ ఆయనకు నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
 
చిత్ర ప్రారంభంలో రామాయణంతో సంబంధం లేదంటూ ప్రదర్శించిన డిస్‌క్లెయిమర్‌ను ఆమోదించేందుకు ధర్మాసనం తిరస్కరించింది. 'రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు, లంక.. ఇలా అందరినీ చూపించి డిస్‌క్లెయిమర్‌ ప్రదర్శిస్తే జనం ఎలా నమ్ముతారు?' అని సెలవుకాల ధర్మాసనంలోని జస్టిస్‌ రాజేశ్‌సింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ శ్రీ ప్రకాశ్‌సింగ్‌ చిత్రబృందాన్ని నిలదీశారు. 
 
ఈ చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పిటిషనర్ల తరపు న్యాయవాది రంజన అగ్నిహోత్రి వాదించారు. 'ఇది వాల్మీకి రామాయణం కాదు.. తులసీదాసు రాసిన రామచరిత మానస్‌ కాదు' అని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆదిపురుష్ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేసిన సెన్సార్ బృందాన్ని కూడా కోర్టు తప్పుబట్టింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు