వినూత్నమైన కథాంశంతో తెరకెక్కి రూ.25 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన 'బిచ్చగాడు' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్. ప్రజలకు పలు విషయాలపై అవగాహన కల్పిస్తూ వారిలో నిత్యం చైతన్యాన్ని నింపడానికి వెండితెర మార్గాన్ని ఎంపిక చేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి. హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమై స్టార్ హీరోయిన్‌గా ఎదిగి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి సహజనటి అని తెలుగువారి చేత అభిమానంగా పిలిపించుకుంటున్న నటి జయసుధ.
ఇప్పుడు ఈ ముగ్గురూ అంటే శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, సహజ నటి జయసుధ కలిసి ఓ సినిమాకు పనిచేయనున్నారు. పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తారనుకుంటే మాత్రం పొరపాటు పడినట్టే. ఆయన ఈ సినిమాలో కథానాయకునిగా నటించనున్నారు.
హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్యగా టైటిల్ పాత్రను ప్లే చేయనున్నారు. ఆయన సతీమణిగా సహజనటి జయసుధ నటించనున్నారు. తనివితీరా ఇంటిల్లిపాదీ కలిసి కూర్చుని చూసే కుటుంబ చిత్రాలు కరువైపోతున్న ఈ రోజుల్లో ఆర్.నారాయణమూర్తిని, సహజనటి జయసుధను మంచి కథ చెప్పి ఒప్పించి దర్శకత్వం చేయడానికి నడుం బిగించారు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు.
'ఒరేయ్.. రిక్షా' చిత్రం తర్వాత తన స్వంత నిర్మాణ సంస్థలో కాకుండా, ఎంతో మంది దర్శకులు, నిర్మాణ సంస్థలు ఎంత మంచి ఆఫర్ ఇచ్చినా ఒప్పుకోకుండా, కథ నచ్చడంతో పాటు చదలవాడ శ్రీనివాసరావుపై అభిమానంతో శ్రీతిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌లో ఆర్.నారాయణమూర్తి నటిస్తున్న చిత్రమిదే కావడం విశేషం.
చదలవాడ తిరుపతిరావు సమర్పణలో చదలవాడ పద్మావతి నిర్మాతగా రూపొందనున్న 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లేను అందించి దర్శకత్వ బాధ్యతలను కూడా చదలవాడ శ్రీనివాసరావు నిర్వహిస్తున్నారు. ఆర్.నారాయణమూర్తి సినిమాలంటేనే సంగీతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటిది ఆయనే కథానాయకునిగా నటిస్తున్న సినిమాకు పాటలు ఎంతటి కీలకపాత్రను పోషిస్తాయో వేరుగా చెప్పక్కర్లేదు. ఈ విషయాన్ని ముందే గమనించిన చదలవాడ శ్రీనివాసరావు పాటల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ చేత సంగీతాన్ని చేయించుకోవడానికి సన్నద్ధులయ్యారు.
ఇప్పటికే సినీ జనాల్లో క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ సినిమాకు సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న సాహిత్యాన్ని అందిస్తున్నారు. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకులు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ... 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య చిత్రం అక్టోబర్ 19న రామోజీ ఫిలింసిటీలో అతిరథమహారథుల సమక్షంలో వైభవంగా ప్రారంభంకానుంది. 60 రోజుల పాటు రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరగనుంది.
నీతి, నిజాయితీ గల ఓ పోలీస్ అధికారి నిజ జీవితంలో, వృత్తిపరంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? వాటిని అదిగమించి విజయమెలా సాధించాడనేదే కథాంశం. డిఫరెంట్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. సినిమాలంటే ఆసక్తితో చిత్ర నిర్మాణ రంగంలో అడుగు పెట్టిన నాకు, కుటుంబ విలువలతో సాగే ఈ సినిమాకు దర్శకత్వం చేయాలనిపించింది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే భావోద్వేగాలతో పాటు అన్ని రకాల వాణిజ్య విలువలను జోడించి తెరకెక్కిస్తాం. తప్పకుండా మా 'హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య' అందరికీ నచ్చే సినిమా అవుతుందని మాత్రం ధీమాను వ్యక్తం చేస్తున్నాను' అని అన్నారు.