బుల్లితెర నటి శ్రావణి ఆత్మహ్యత్య : ఎవరీ దేవరాజ్ రెడ్డి?
గురువారం, 10 సెప్టెంబరు 2020 (09:21 IST)
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్యకు ఆమె ప్రియుడు దేవరాజ్ రెడ్డి ప్రధాన కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా శ్రావణి - దేవరాజ్‌ల మధ్య జరిగిన మొబైల్ సంభాషణలకు సంబంధించిన ఆడియో ఒకటి తాజాగా లీక్ అయంది. ఇందులో శ్రావణిని దేవరాజ్ బెదిరించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో అసలు ఈ దేవరాజ్ రెడ్డి ఎవరు..? అతనికి శ్రావణికి మధ్య ఎలా పరిచయం ఏర్పడింది? అది ప్రేమగా ఎలా మారిందన్న విషయాలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి.
బుల్లితెర నటి శ్రావణి గత ఎనిమిదేళ్లుగా తెలుగు టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. 'మౌనరాగం', 'మనసు మమత' వంటి ఎంతో ప్రజాదారణ పొందిన టీవీ సీరియల్స్‌లో ఆమె ప్రధాన పాత్రను పోషించి మంచి పేరుతో పాటు డబ్బును సంపాదించుకుంది. ప్రస్తుతం మధురానగర్ హెచ్ బ్లాక్ 56లో గల ఓ అపార్ట్‌మెంట్‌లో శ్రావణి కుటుంబం నివాసం ఉంటోంది.
అయితే, అలాంటి శ్రావణిక టిక్‌టాక్ ద్వారా ఆంధ్రప్రదేశ్, కాకినాడకు చెందిన దేవరాజ్ రెడ్డి అలియాస్ సన్నీతో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. తనకు వెనకా ముందు ఎవరూ లేరని, ఆశ్రయం కల్పిస్తే ఏదైనా పనిచేసుకుంటానని అతను కోరడంతో శ్రావణి తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో హైదరాబాద్‌కు వెళ్లిన దేవరాజ్... గత యేడాది సెప్టెంబరు 5వ తేదీ నుంచి శ్రావణి ఇంట్లోనే ఉంటున్నాడు.
దీంతో శ్రావణి, దేవరాజ్‌ల మధ్య మరింత చనువు ఏర్పడింది. శ్రావణి టీవీ సీరియల్స్‌కు చెందిన ఓ కార్యాలయంలో దేవరాజ్‌కు పనికూడా పెట్టించింది. సుమారు 4 నెలల పాటు బాగానే ఉంటూ వచ్చారు. తర్వాత వీరి మధ్య విభేదాలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. అయితే తనను దూరం పెట్టిందన్న కోపంతో శ్రావణితో చనువుగా ఉండగా తీసిన ఫొటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని దేవరాజ్ బెదిరింపులకు పాల్పడసాగాడు.
అవసరమైనప్పుడల్లా ఫోన్లు చేసి డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని డబ్బులు తీసుకునేవాడు. అతడి వేధింపులు మరింతగా పెరగడంతో శ్రావణి మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బాత్‌రూంలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాత్‌రూంలో నుండి శ్రావణి ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి తల్లిదండ్రులు తలుపు పగలగొట్టి లోపలకు వెళ్లి చూడగా ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది.
వెంటనే ఆమెను సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రావణి తల్లి పాపారత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేవరాజ్‌రెడ్డి వేధింపులు భరించలేకే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని, అతడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.