కమల్ హాసన్‌‌కు మద్దతు.. ఆయనకొక సమస్య వుంటే ఊరుకోం: విశాల్ వార్నింగ్

శనివారం, 15 జులై 2017 (14:42 IST)
సినీ లెజండ్ కమల్ హాసన్ ప్రస్తుతం అందరి నోళ్లల్లో నానుతున్నారు. బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్‌.. ఇటీవలే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. బిగ్ బాస్ షోకు ఆయన హోస్ట్‌గా వ్యవహరించడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
బిగ్ బాస్‌కు వ్యతిరేకంగా కమల్ హాసన్‌పై కేసులు నమోదైనాయి. ఇంటిని కూడా ముట్టడించారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 100 రోజుల వరకైనా జరుగుతుందా.. అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. కానీ కమల్ హాసన్‌కు తాను మద్దతిస్తానని.. ఆయనకొక సమస్య వుంటే సినీ ఇండస్ట్రీనే ఆయన వెంట నిలుస్తుందని నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, నిర్మాతల సంఘం అధ్యక్షుడు, నటుడు విశాల్ తెలిపాడు. 
 
సాధారణంగా కమల్ హాసన్ ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్నారంటే.. ఆ షో గురించి అన్నీ ఆరా తీశాకే నిర్ణయిస్తారని విశాల్ చెప్పాడు. బిగ్ బాస్ తప్పుదారి పట్టించే షో అని తెలిసివుంటే ఆయన తప్పకుండా ఆ షోలో పాల్గొని వుండేవారు కాదని విశాల్ వ్యాఖ్యానించాడు. ఈ విషయంలో కమల్‌కు పూర్తి మద్దతిస్తామన్నాడు. సినీ లెజండ్ అయిన కమల్ హాసన్‌ను ఏకవచనంలో సంబోధించడం మానాలని విశాల్ హెచ్చరించాడు. ఓ మంత్రి బిగ్ బాస్ షో సంస్కృతిని మంటగలిపే విధంగా ఉందని.. కమల్‌ను ఏకవచనంగా సంబోధించారని.. ఇకపై అలాంటివి మానుకోవాలని గౌరవప్రదంగా కమల్ హాసన్‌ను సంబోధించాలన్నాడు.

వెబ్దునియా పై చదవండి