కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఏ హీరో చేయని పనిచేసి తమిళ తంబీలను ఆకట్టుకున్నాడు. తమిళనాడులోని 'అనిల్ సేమియా' కంపెనీకి ప్రచారకర్తగా ఉండేందుకు విజయ్ సేతుపతి డీల్ కుదుర్చుకున్నాడు. ఈ సంస్థ ఐదు ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా దిండుగల్‌లో కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో ఈ బ్రాండ్ అంబాసిడర్ విజయ్ సేతుపతి పాల్గొని వాటిని లాంఛనంగా ఆవిష్కరించాడు.
ఈ సందర్భంగా 50 లక్షల రూపాయల పారితోషికాన్ని విజయ్ సేతుపతికి అందజేసింది. ఈ మొత్తాన్ని విజయ్ సేతుపతి తీసుకోకుండా విద్య, మౌలిక వసతుల కల్పనలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా తమిళనాట పేరొందిన అరియలూర్‌లోని 774 అంగన్వాడీలు, 10 అంధుల పాఠశాలలు, 11 బధిర పాఠశాలలకు విరాళంగా ఇచ్చేశారు.
ఒక్కో అంగన్వాడీకి 5,000 రూపాయలిచ్చిన సేతుపతి, ఒక్కో అంధుల, బధిర పాఠశాలకు 50,000 రూపాయల చొప్పున విరాళంగా ఇచ్చారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.50లక్షలను పారితోషికంగా ఇచ్చేయడంపై విజయ్ సేతుపతిని అందరి మెచ్చుకుంటున్నారు.