అన్నదాతకు అండ : ప్రతి టిక్కెట్‌ ధరలో ఒక్క రూపాయి రైతు నిధికి.. నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్

శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (11:51 IST)
తెలుగు కుర్రోడు విశాల్ కృష్ణన్ అలియాస్ విశాల్ తమిళనాడు చిత్ర పరిశ్రమలో ఏలేస్తున్నారు. హీరోగా, నిర్మాతగా, నడిగర సంఘం అధ్యక్షుడిగా, నిర్మాతల మండలి ప్రెసిడెంట్‌గా ఇలా కీలకంగా ఉన్న విశాల్... ఇపుడు అన్నదాతకు ఉండాలని భావిస్తున్నారు. 
 
తమిళ నిర్మాతల మండలి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన విశాల్‌తో పాటు ఆయన ప్యానెల్ వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. అధ్యక్షుడు విశాల్‌తో 'పదినారు వయదినిలే' నిర్మాత రాజ్‌కన్ను, ఉపాధ్యక్షుడు గౌతమ్‌ మేననతో ఎస్‌ఏ చంద్రశేఖర్‌ పదవీ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు, దర్శకులు, ఇతర సినీ సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తీవ్ర కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోనున్నట్టు చెప్పారు. ఇందుకోసం ప్రతి సినిమా టిక్కెట్ ధరలో ఒక్క రూపాయి రైతులకు అందిస్తామన్నారు. ఇందుకోసం రైతు నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. ఆ నిధికి ఎన్ని కోట్లు వసూలైనా ఆ మొత్తాన్ని రైతులకు పంపిణీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయంపై తమిళ చిత్రపరిశ్రమే కాకుండా రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. 

వెబ్దునియా పై చదవండి