తమిళ దళపతి విజయ్ నటించిన లియో సినిమా ఈరోజే తెలుగులోనూ విడుదలైంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పూర్తి యాక్షన్ సినిమా. మరి ఈ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం.
కథ:
పార్తీబన్ (విజయ్) తన భార్య సత్య (త్రిష), కూతురు, కొడుకుతో హిల్ స్టేషన్‌లో వుంటాడు. కాఫీ షాప్ నడుపుతూ జీవనం సాగించే పార్తీబన్‌కు గతం ఒకటి వుందని డ్రెగ్ మాఫియా డాన్ ఆంటోనీదాస్ (సంజయ్ దత్) వచ్చి చెబుతాడు. లియో నేను కాదని చెప్పినా అంటోనీ వినడు. ఆంటోనీకి యాక్షన్ కింగ్ అర్జున్ తమ్ముడు. వీళ్ళంతా ఓ దశలో పార్తీబన్ కుటుంబంపై ఎటాక్ చేస్తారు. ఆ తర్వాత ఏమయింది? అనేది సినిమా.
సమీక్ష:
ఈమధ్య డ్రెగ్ మాఫియాపై సినిమాలు వస్తున్నాయి. అందులో లియో ఒకటి. హింసకూడా ఎక్కువైంది. ఇంతకుముందు విక్రమ్ సినిమాలో కమల్‌హాసన్ చేసిన వయెలెన్స్ తెలిసిందే. ఇందులోనూ హింసాసన్నివేశాలు చూస్తుంటే ఆ సినిమానే గుర్తుకు వస్తుంది. సంజయ్‌దత్ గ్యాంగ్‌లో వందలాది మందిని ఒక్కడే పార్తీబన్ ఎటాక్ చేయడం వంటి విశేషాలు చాలా వున్నాయి.
ఇక పోలీసుల కన్నుగప్పి డ్రెగ్‌ను లారీలతో అటవీమార్గంనుంచి పట్టణానికి జార వేసే సన్నివేశాలు పుష్ప సినిమాను గుర్తుకు చేస్తాయి. ఇందులో విజయ్ రెండు షేడ్స్ వున్న పాత్రలు పోషించాడు. పైగా తోడేలు, ఈగెల్ పాత్రలు కూడా వెరైటీగా కనిపిస్తాయి.
త్రిషది బరువైన పాత్ర. తన బర్తపై వచ్చే ఆరోపణలతో అనుమానంతో పరిశోధనలు చేయడం, మరోవైపు పిల్లలను కాపాడుకోవడం వంటి సన్నివేశాల్లో అలరించింది. సంజయ్ దత్, అర్జున్ పాత్రల్లో వయెలెన్స్ భారీ స్థాయిలో వుంది. దర్శకుడు రాసుకున్న యాక్షన్, ఎమోషన్స్ ఆయన గత సినిమాలను తలపిస్తాయి. అయినా విజయ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని రాసినట్లుంది. అనిరుద్ సంగీతం పర్వాలేదు.
లియో, పార్తీబన్ పాత్రలు ట్రీట్‌మెంట్ ఇంకా బాగా రాసుకుంటే బాగుండేది. ఎక్కువగా కత్తులతో, తుపాకులతో నరుక్కోవడాలు చూపించాడు. మొదటిభాగం స్లోగా సాగుతుంది. సెకండాఫ్‌లో అసలు కథ మొదలై ఫటాఫటాగా సాగుతుంది.
దక్షిణాదిలో వున్న కొన్ని మూఢ నమ్మకాలను ఇందులో సంజయ్‌దత్ పాత్రలో చూపించాడు దర్శకుడు. డ్రెగ్ వ్యాపారం బాగాసాగాలంటే దేవుడికి చిన్న చిన్న జంతువులను బలిఇచ్చే స్థాయినుంచి కన్నకొడుకునూ బలి ఇచ్చే స్థాయికి ఎదిగిన వైనాన్ని చూపించాడు. మాఫియాలకు బంధాలు అనేవి వుండవని తెలిపాడు. ఏది ఏమైనా ఈ సినిమాలో హీరోయిజం కావాల్సినంత వుంది. యాక్షన్ అంతకంటే ఎక్కువగా వుంది. కానీ ప్రేక్షకుడు ఇన్‌వాల్వ్ అయ్యే అంశమే సరిగ్గా లేదు. ఇది తెలుగులో ఏ మేరకు ఆడుతుందో ప్రేక్షకుల ఆదరణ బట్టి తెలుస్తుంది.