కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో మంచి నేతగా, అందరిని కలుపుకునిపోయే నేతగా బీఎస్. యడ్యూరప్పకు పేరుంది. అయితే, ఆయన్ను మించిన దురదృష్టవంతుడు మరొకరు లేరని చెప్పొచ్చు. ఎందుకంటే... ఆయనకు ముఖ్యమంత్రి అచ్చొచ్చినట్టు కనిపించడం లేదు. తొలిసారి ఆయన సీఎం పీఠంపై 2007 నవంబరు 12వ తేదీన కూర్చొన్నారు.
కేవలం ఏడు రోజుల్లో అంటే 2007 నవంబరు 19వ తేదీన దిగిపోయారు. ఆ తర్వాత మరుసటి సంవత్సరం అంటే 2008 మార్చి 30వ తేదీన రెండోసారి సీఎం అయ్యారు. ఇపుడు మూడు సంవత్సరాల 62 (1157 రోజులు) రోజులు పదవిలో ఉండి చివరకు మైనింగా మాఫియాలో చిక్కుకుని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇపుడు పదేళ్ల తర్వాత ఆయనకు మరోమారు సీఎం పదవి వరించింది.
కానీ, ఆయన పూర్తికాలం కొనసాగే సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే మంగళవారం వెల్లడైన కన్నడ ఓటరు తీర్పులో బీజేపీకి 104 సీట్లు మాత్రమే వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 8 సీట్లు కావాల్సి ఉంది. కానీ, తమకు అనుకూలురైన గవర్నర్ వజూభాయ్ వాల్ సహకారంతో ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, బలపరీక్షలో ఆయన విజయం సాధిస్తారా అంటే ప్రతి ఒక్కరూ డౌటేనంటున్నారు.
ఎందుకంటే... ఆయనకు మద్దతు ఇచ్చేందుకు స్వతంత్ర ఎమ్మెల్యేలు లేరు. పైగా కాంగ్రెస్‌కున్న 78 మంది, జేడీఎస్‌కు ఉన్న 38 మంది ఎమ్మెల్యేలతో పాటు.. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలంతా ఒక జట్టుగా ఏర్పడ్డారు. వీరందర్నీ కలుపుకుంటే మొత్తం 118 మంది ఎమ్మెల్యేలు. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ మార్క్ కంటే ఆరుగురు సభ్యులు అధికంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప గురువారం ప్రమాణ స్వీకారం చేసినా మున్ముందు ఏం జరుగుతుందోనన్న బెంగతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.