తమ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందనే భ్రమను విపక్ష పార్టీలు కల్పించాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. నిజానికి తాము రైతులన మోసం చేయబోమన్నారు. తాను ఇపుడు రక్షణ మంత్రిని కావొచ్చు.. కానీ, తానూ ఓ రైతు బిడ్డనేనని గుర్తుచేశారు.
కేంద్రం తీసుకొచ్చిన నూతన చట్టాలు రైతుల ఆదాయాన్ని పెంచుతాయని, వచ్చే నాలుగైదేళ్లలో ఆ లాభాలను రైతులు చూడగలుగుతారని ఆయన పేర్కొన్నారు. నూతన చట్టాలు రైతులకు ఏమాత్రం హాని కలిగించవని ధీమాగా ప్రకటించగలనని, ఎందుకంటే చట్టంలోని ప్రతి పేరాను తాను క్షుణ్ణంగా చదవానని ఆయన నొక్కి వక్కాణించారు.
చట్టాలతో వ్యవసాయ మార్కెట్లేమీ నష్టపోవని, అవి కొనసాగుతూనే ఉంటాయని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో కనీస మద్దుత ధరకు ఎలాంటి ముప్పూ లేదని, భవిష్యత్తులో కూడా కనీస మద్దతు ధర కొనసాగుతూనే ఉంటుందని రాజ్‌నాథ్ వివరించారు. కానీ, రైతులతో పాటు విపక్ష పార్టీల నేతలు మాత్రం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగానే ఈ చట్టాన్ని తయారు చేశారంటూ ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే.