అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఇపుడు ఎమ్మెల్యేలను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. రోషం లేనివాళ్లు, మొలకు మొలతాడు కట్టని వారంతా ఎమ్మెల్యేలయ్యాంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.
మరోవైపు, రాజకీయ నేతలను ఉద్దేశించి కదిలి, పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి, సీఐ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై స్వయానా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలే మండిపడుతున్నారు. శనివారం మండలకేంద్రమైన పెద్దవడుగూరులో టీడీపీ నాయకులు సమావేశం నిర్వహించారు.
ఇందులో ఈనెల 15న చిన్నపొలమడ గ్రామంలోని ప్రజలు వినాయకచవితి సందర్భంగా నిమజ్జనం చేసేందుకు వెళుతున్నవారిపై ప్రబోధానంద శిష్యులు విచక్షణారహితంగా దాడులు చేయగా పోలీసుల వైఫల్యం పట్ల ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సీఐ గోరంట్ల మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు తగదన్నారు. ఆ సంఘటన జరిగినపుడు పదుల సంఖ్యలో పోలీసులు ఉండి ప్రజలను రక్షించలేకపోయారనే బాధతో అన్నారే తప్ప పోలీసు శాఖను ఉద్దేశించి కాదన్నారు.
ప్రజలను రక్షించాల్సిన పోలీసులు బాధ్యతారహితంగా ఒక ఎంపీని బహిరంగంగా సవాల్ విసిరితే సామాన్య ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళితే వారితో ఎలా వ్యవహరిస్తారో అర్థమవుతుందన్నారు. ప్రబోధానంద శిష్యులు సమాజంలో శాంతిని నెలకొల్పాలే తప్ప గ్రామప్రజల మీద మారణాయుధాలతో దాడులు చేయడం దారుణమైన విషయమన్నారు. అలాంటి వారిపై చర్యలు చేపట్టడంలో మాత్రం పోలీసులు విఫలమయ్యారని వారు ఆరోపించారు.