అయితే ఓకే.. మహిళలందరికీ అయ్యప్ప దర్శనం... సమ్మతించిన దేవస్థాన బోర్డు

బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (19:03 IST)
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనంకు ఇకపై మహిళలు కూడా వెళ్లొచ్చు. ఈ మేరకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీపీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నిర్ణయం గతంలో అనుసరించిన తీరుకు పూర్తి విరుద్ధం కావడం గమనార్హం. కాగా, ఈ ఆలయ పర్యవేక్షణ బాధ్యతలను ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు చూస్తోంది.
 
కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని గతంలో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఏ ఎం ఖన్విల్కర్, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. 
 
ఈ సందర్భంగా నాయర్ సర్వీస్ సొసైటీ తరపున సీనియర్ న్యాయవాది కే పరాశరన్ వాదనలు వినిపించారు. ఈ తీర్పును రద్దు చేయాలని కోరారు. ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు తన వైఖరిని పూర్తిగా మార్చుకుంది. అన్ని వయసుల మహిళలను దేవస్థానంలోకి అనుమతించాలని సుప్రీంకోర్టుకు తెలిపింది.
 
రాజ్యాంగ ధర్మాసనంలోని జస్టిస్ ఇందు మల్హోత్రా బోర్డు తరపు న్యాయవాదిని ఉద్దేశించి మాట్లాడుతూ రిట్ పిటిషన్లపై తీర్పు సందర్భంగా చేసిన వాదనలో మార్పు వచ్చిందా? అని అడిగారు. దీనిపై బోర్డు తరపు న్యాయవాది సమాధానం చెప్తూ 'ఔను, తీర్పును గౌరవించాలని బోర్డు నిర్ణయించింది, దీనికి సంబంధించి దరఖాస్తు కూడా చేసింది' అని చెప్పింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు