10లో రెండు అంకెలు ఉంటాయి... అవి 1, 0, ఏది ఇస్తారో మీ యిష్టం : చిదంబరం

ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (13:00 IST)
లోక్‌సభలో దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 సంవత్సరానికిగాను వార్షికబడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై విపక్ష పార్టీల నేతలంతా పెదవి విరించారు. ఈ క్రమంలో మాజీ విత్తమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం స్పందించారు. ఈ బడ్జెట్‌కు మీరిచ్చే ర్యాంకు ఏంటని మీడియా ప్రశ్నించింది. వీరికి దిమ్మతిరిగిపోయే సమాధానాన్ని ఇచ్చారు ఈ హార్వార్డ్ విశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థి. 
 
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై 1 నుంచి 10 లోపు ఎంత స్కోరు ఇస్తారని చిదంబరంను మీడియా ప్రశ్నించింది. దీనికి సమాధానమిస్తూ, "పది సంఖ్యలో రెండు అంకెలుంటాయి. అవి 1, 0. ఏది ఇస్తారో మీరే నిర్ణయించుకోండి" అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. 
 
ఈ బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తిగా వ్యతిరేకించాల్సినవేనని ఆయన అభిప్రాయపడ్డారు. క్షేత్ర స్థాయిలో అభివృద్ధి లేకుండా వృద్ధిని ఎలా పెంచుతారని ఆయన ప్రశ్నించారు. డిమాండ్‌కు అనుగుణంగా పెట్టుబడుల ఆకర్షణకు చర్యలను ప్రకటించడంలో కేంద్రం విఫలమైందని నిప్పులు చెరిగారు.
 
"ఆర్థిక మంత్రి రెండు ప్రధాన సవాళ్లను మరిచిపోయారు. ఈ రెండు సవాళ్లను ఎలా అధిగమిస్తామన్న విషయాన్ని ఆమె ప్రస్తావించలేదు. ఇవి రెండూ ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనపరిచేవే. దేశంలోని కోట్లాది మంది పేదలకు, మధ్య తరగతి వర్గాలకూ ఈ బడ్జెట్ ఏ విధమైన ఉపశమనాన్నీ కలిగించలేదు" అని ఆయన వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు