శ్రీకాళహస్తి పరిధిలో వెయ్యి పడకలతో తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రికి జిల్లా యంత్రాంగం ప్రణాళిక రచిస్తోంది. శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరి, ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద పదిఎకరాల ప్రభుత్వ భూమిలో ఏర్పాటు కానుంది తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రి. వెయ్యిమంది రోగులకు ఆక్సిజన్ పడకలతో వైద్యం అందించేలా జర్మన్ షెడ్ల ఏర్పాటుకు సమాలోచనలు చేస్తున్నారు అధికారులు.
అలాగే దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నాలుగు లక్షలకుపైగా నిత్యం నమోదవుతుండగా.. ఏపీలోనూ ఈ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇక్కడ నిత్యం 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తుండగా కేసులు మాత్రం తగ్గడం లేదు. ఉదయం 6 నుండి 12 గంటల వరకు ప్రజలకు అనుమతి ఉండడంతో ఈ సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు బయటకు వస్తున్నారు. దీంతో కేసులు పెరిగిపోతున్నాయి.